Page Loader
Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. 18 గంటలు ఆలస్యం, కారణం ఇదేనా? 
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. 18 గంటలు ఆలస్యం, కారణం ఇదేనా?

Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. 18 గంటలు ఆలస్యం, కారణం ఇదేనా? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2025
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్‌లో నాలుగు రోజుల క్రితం ఎయిర్ ఇండియా విమానానికి జరిగిన ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. శనివారం, ఆదివారం పాటు అదే సంస్థకు చెందిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాల్లోనూ సాంకేతిక సమస్యలు తలెత్తి ప్రయాణికుల సహనాన్ని పరీక్షించాయి. ఈ రెండు విమానాలూ కోల్‌కతాకు వెళ్లాల్సినవే కావడం గమనార్హం. శనివారం రాత్రి 9.20 గంటలకు గువాహటి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్‌కతా వెళ్ళాల్సిన ఐఎక్స్‌-1226 విమానం, 170 మంది ప్రయాణికులతో సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యమైంది. అసలు సమస్య ఏమిటో స్పష్టత లేక, ఎప్పుడు బయలుదేరుతుందో తెలియక ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. దీనిపై పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Details

విసిగిపోయిన ప్రయాణికులు

అర్థరాత్రి 1.30 సమయంలో ప్రయాణికులను విమానం దిగమని చెప్పి సమీప హోటల్‌కు తరలించారు. అనంతరం ఆదివారం ఉదయం 9.30కి మళ్లీ విమానం ఎక్కించగా, అదే సమస్య మరోసారి తలెత్తింది. ఈనేపథ్యంలో మరోసారి విమానంలో నుంచి కిందకు దించి, విమానాశ్రయానికి తీసుకెళ్లారు. అధికారుల ప్రకారం, వారికి ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. చివరికి, కొత్త విమానంలో సాయంత్రం 3.34కి వారు ప్రయాణం ప్రారంభించారు. ఈ ఆలస్యానికి విసిగిన కొందరు ప్రయాణికులు వేరే విమానాలను ఎంచుకున్నారు. ఇక ఆదివారం ఉదయం మరో ఇబ్బంది. గాజియాబాద్‌ నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరి 9.20కి కోల్‌కతా చేరాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం (ఐఎక్స్‌ 1511)లో టేకాఫ్‌కి ముందు సాంకేతిక లోపం గుర్తించడంతో ప్రయాణాన్ని నిలిపివేశారు.

Details

ఆందోళనలో ప్రయాణికులు

ఇది రన్‌వేపైనే సుమారు గంటసేపు నిలిపివేయబడింది. సంస్థ 7 గంటల ఆలస్యాన్ని తెలియజేస్తూ, ప్రయాణికులకు టికెట్ డబ్బును తిరిగి ఇచ్చేందుకు అవకాశముందని పేర్కొంది. లోపాన్ని పరిష్కరించిన తర్వాత మధ్యాహ్నం 2.09కి విమానం బయలుదేరి సాయంత్రం 4.24కి గమ్యస్థానానికి చేరుకుంది. ఇదే సమయంలో మరో పెద్ద సమస్య బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు ఎదురైంది. లండన్‌ నుంచి చెన్నైకు బయల్దేరిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో, విమానాన్ని అర్థంతరంగా తిరిగి లండన్ హీత్రో విమానాశ్రయానికి మళ్లించారు. ఈ వరుస ఘటనలతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సేవలపై ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సంస్థ యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.