Telangana: తెలంగాణలో గోదావరి పుష్కరాలకు రూ.1,100 కోట్లు: మంత్రి పొంగులేటి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణవ్యాప్తంగా గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.1,100 కోట్లు కేటాయించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పుష్కరాల ఏర్పాట్ల కోసం అవసరమైతే అదనంగా నిధులు కేటాయించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి నదీ తీరంలో ఉన్న ఆలయాలను అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలంలో పర్యటించారు. ఈ సందర్భంగా రంగనాయకులగుట్ట వద్ద రూ.5.45 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి రిజర్వాయర్, బోర్లు, పైపులైన్లు, పంపుల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. గోదావరి ఘాట్ వద్ద మరుగుదొడ్ల నిర్మాణ పనులకు కూడా శ్రీకారం చుట్టారు.
వివరాలు
పుష్కరాల ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష
అదేవిధంగా నూతన మార్కెట్‌లో రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న గిరిజన బహుళ ప్రయోజన మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు.
అనంతరం భద్రాచలం రామాలయాన్ని సందర్శించిన మంత్రి, ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు.
ఆలయ ఉత్తర ద్వారం వద్ద ఉన్న శిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
డిసెంబరు 19న నిర్వహించనున్న తెప్పోత్సవం, 20న జరగనున్న ముక్కోటి మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
వివరాలు
భద్రాచలం రామాలయ అభివృద్ధి కోసం రూ.300 కోట్లు
భద్రాచలం రామాలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.300 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు.
పనుల అవసరాలను బట్టి మరిన్ని నిధులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.