Telangana Free Bus : ఉచిత బస్సులపై ఆటో డ్రైవర్ల ఆందోళన.. తమ పొట్టకొట్టొదని ఆవేదన
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు గ్యారెంటీ వివాదాస్పదమైంది. రాష్ట్రంలో లక్షలాది మంది ఆందోళనలకు కారణంగా నిలుస్తోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి. ఇందులో భాగంగానే మహిళలందరికీ ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని డిసెంబర్ 9న అమలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పల్లె వెలుగు, ఎక్స్'ప్రెస్ బస్సుల్లో మహిళలకు ప్రయాణాన్ని ఉచితం చేసింది. ఈ క్రమంలోనే మహిళలంతా ఆటోలు, రిక్షాలు, క్యాబ్ సర్వీసులను వదిలేసి బస్సుల బాట పట్టారు. బస్సుల్లోనే ప్రయాణం చేస్తూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దీంతో ప్రభుత్వమే టాక్సీ డ్రైవర్ల పొట్టకొడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్ల నిరసన
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆటో డ్రైవర్లు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి అవకాశం కల్పించడంతో తమ ఉపాధి దెబ్బతిందని బోరుమంటున్నారు. అప్పులు చేసి ఆటోలు కొనుక్కుని జీవనం సాగిస్తున్నామని, అప్పుల భారం పెరిగి జీవితం మరింత దుర్భరంగా మారుతుందని కన్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం తీసుకునే ముందు రవాణాపై ఆధారపడిన తమ గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉచిత బస్సు పథకాన్ని వెంటనే రద్దు చేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో రాస్తారోకో నిర్వహించిన ఆటో డ్రైవర్లు సర్కారు వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఆటో డ్రైవర్ల ఆందోళనలు కొనసాగుతుండటం గమనార్హం.