Telangana: బీటెక్ సీట్ల పెంపుకు సీఎం గ్రీన్‌సిగ్నల్.. వెబ్ ఆప్షన్లకు ముందు కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఇంజినీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు శుభవార్త అందింది. రాష్ట్రంలోని బీటెక్ సీట్ల సంఖ్య పెరగనుండటంతో, శుక్రవారం ప్రారంభమయ్యే రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో మరిన్ని సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE) రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలకు సుమారు 15 వేల అదనపు బీటెక్ సీట్లకు అనుమతి ఇచ్చింది. అయితే, ఈ సీట్లను కౌన్సెలింగ్‌లో చేర్చాలా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంపై ఆధారపడి ఉంది.
వివరాలు
4 వేల అదనపు సీట్లు
ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్, విద్యాశాఖ ఉన్నతాధికారులు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై ఈ అంశంపై చర్చించారు.
అదనపు సీట్లకు ముఖ్యమంత్రి ఆమోదం తెలపడంతో, రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్,ఎప్‌సెట్ ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన ఆధ్వర్యంలో అధికారులు కళాశాలల వారీగా, కోర్సుల వారీగా అదనపు సీట్ల వివరాలను ఖరారు చేసే ప్రక్రియను ప్రారంభించారు.
ప్రస్తుతం సుమారు 4 వేల అదనపు సీట్లు రెండో విడత కౌన్సెలింగ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
వీటిలో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద విద్యార్థులకు కేటాయించనున్నారు.
వివరాలు
ఈ నెల 18 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం
ఈ నెల 18 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం కానుండటంతో, అదనపు సీట్లపై శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం ఉదయం వరకు పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
అయితే, ఏ కళాశాలకు ఎన్ని అదనపు సీట్లు కేటాయిస్తారన్న విషయాన్ని అధికారులు ప్రస్తుతం వెల్లడించడం లేదు.
కొన్ని కళాశాలలకు అదనపు సీట్లు మంజూరు కాకపోతే అవి న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉండటంతోనే ఈ వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం.
వివరాలు
తనిఖీలు పూర్తి కానీ జేఎన్‌టీయూహెచ్,ఓయూ
మరోవైపు, అదనపు సీట్లను మంజూరు చేయాలంటే సంబంధిత విశ్వవిద్యాలయాలు ఆయా కళాశాలల్లో తనిఖీలు నిర్వహించి, అవసరమైన మౌలిక వసతులు, అధ్యాపకులు, ఇతర సౌకర్యాలు ఉన్నాయని ధ్రువీకరిస్తూ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే ఇప్పటివరకు జేఎన్‌టీయూహెచ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) ఈ తనిఖీలు పూర్తి చేయలేదని తెలుస్తోంది.
అయినప్పటికీ, అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
తొలి విడతలో 27,487 సీట్లు ఖాళీ
ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్‌లో 79 వేల మందికిపైగా విద్యార్థులకు సీట్లు కేటాయించినప్పటికీ, 8,162 సీట్లు ఇంకా భర్తీ కాలేదు.
అలాగే సీట్లు పొందిన వారిలో 19,325 మంది ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోవడంతో, ఆ సీట్లు కూడా ఖాళీగా పరిగణిస్తున్నారు.
దీంతో మొత్తం 27,487 సీట్లు రెండో విడత కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉండనున్నాయి.
ఇదే సమయంలో ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో కూడా అదనపు సీట్లు పెరిగే అవకాశాలు ఉండటంతో, ఇప్పటికే వెబ్ ఆప్షన్లు నమోదు చేసిన విద్యార్థుల్లో చాలామంది తమ ప్రాధాన్యతలను మార్చుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.