Telangana Cabinet: తెలంగాణ మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ .. దిల్లీలో కాంగ్రెస్ కీలక నేతల మంతనాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు వరుసగా దిల్లీ బాట పట్టడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే దిల్లీలో ఉన్నారు. మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతున్న మంత్రి కొండా సురేఖ కూడా దిల్లీలోనే ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు బుధవారం దిల్లీకి వెళ్లనున్నారు.
వివరాలు
పర్యటనలకు ప్రాధాన్యం
కేంద్ర మంత్రులను కలవడం, జలశక్తి మంత్రిత్వశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొనడం, వై.ఎస్.రాజశేఖరరెడ్డి అవార్డు కార్యక్రమానికి హాజరవడం వంటి వేర్వేరు కారణాలతో నేతలు దిల్లీకి వెళ్తున్నట్లు చెబుతున్నారు.
అయితే రాష్ట్రంలో మంత్రివర్గ మార్పులపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఈ పర్యటనలకు ప్రాధాన్యం ఏర్పడింది.
విదేశీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ కూడా మంగళవారం తెల్లవారుజామున దిల్లీకి చేరుకున్నారు.
వివరాలు
రేవంత్‌తో కేసీ సుదీర్ఘ భేటీ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీ చేరుకున్న కేసీ వేణుగోపాల్‌తో మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు.
ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.
మంత్రి కొండా సురేఖ వ్యవహారంతోపాటు ఒకరిద్దరు మంత్రుల పనితీరు, వ్యవహారశైలిపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది.
మంత్రివర్గంలో కొత్తగా ఎవరిని చేర్చుకోవాలన్న అంశంపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తోనూ కేసీ వేణుగోపాల్ చర్చించే అవకాశం ఉందని సమాచారం.
ఈ భేటీ బుధవారం జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయంతో మహేశ్‌కుమార్‌గౌడ్ ఉన్నట్లు సమాచారం.
వివరాలు
క్రమశిక్షణ చర్యలకే పరిమితమా?
ఈ నేపథ్యంలో కొండా సురేఖ,చిన్నారెడ్డిపై చర్యలు తప్పకపోవచ్చని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పార్టీ క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా సురేఖ,చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవడంతోనే అధిష్ఠానం ఆగిపోతుందా? లేక మంత్రివర్గంలో మరిన్ని మార్పులు,చేర్పులు చేపడుతుందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు కొండా సురేఖ స్వయంగా దిల్లీ వెళ్లిన నేపథ్యంలో,ఆమెపై చర్య తీసుకునే ముందు అధిష్ఠానం ఆమె వాదనను కూడా వినే అవకాశం ఉందని కాంగ్రెస్‌లోని కొందరు నేతలు చెబుతున్నారు.
సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఆమె స్థానాన్ని మాత్రమే భర్తీ చేస్తారా? లేక ప్రస్తుతం ఖాళీగా ఉన్నమరో రెండు మంత్రి పదవులను కూడా భర్తీ చేస్తారా? మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేస్తారా? అనే అంశాలపై పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
వివరాలు
శాసనసభ సమావేశాల తర్వాతే విస్తరణ?
మొత్తంగా మంత్రివర్గంలో పూర్తిస్థాయి ప్రక్షాళన జరుగుతుందా లేదా పరిమిత మార్పులతో సరిపెడతారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఈ నెల 7 నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
వాటి తర్వాతే మంత్రివర్గ విస్తరణ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం, రాష్ట్ర నాయకత్వం మరింత దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఒకవేళ సురేఖ స్థానాన్ని భర్తీ చేయాల్సి వస్తే.. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మరో రెండు స్థానాలతో కలిపి పరిమిత మార్పులకే ప్రభుత్వం వెళ్లవచ్చని పార్టీ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుత మంత్రుల శాఖల్లో పెద్దగా మార్పులు చేయకపోవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది.
వివరాలు
సురేఖ స్థానంలో ఆది శ్రీనివాస్..
కొండా సురేఖ స్థానాన్ని ఆమెకు చెందిన సామాజికవర్గానికే కేటాయించాల్సి వస్తే విప్ ఆది శ్రీనివాస్ పేరును పరిశీలించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు చిన్నారెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగిస్తే.. ఆయన నిర్వహిస్తున్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిని బీసీ వర్గానికి అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా మంత్రివర్గంలో చోటు కోసం ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
అయితే ఇప్పటికే పొన్నం ప్రభాకర్ మంత్రివర్గంలో ఉన్నందున మహేశ్‌కుమార్‌గౌడ్‌కు అవకాశం కల్పిస్తారా? అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.
ప్రస్తుతం ముదిరాజ్, గౌడ్, మున్నూరుకాపు వర్గాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉంది. యాదవ సామాజికవర్గం నుంచి మాత్రం ఎవరూ మంత్రివర్గంలో లేరు.
వివరాలు
రెండు బెర్త్‌లపై సామాజిక సమీకరణాలు
సురేఖ, చిన్నారెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పిస్తే.. ఆ రెండు స్థానాలను బీసీల్లోని రెండు వేర్వేరు వర్గాలకు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవుల్లో ఒకదాన్ని లంబాడా వర్గానికి ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరుతున్నట్లు సమాచారం.
లంబాడా వర్గం నుంచి రామచంద్రునాయక్, బాలూనాయక్ పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి.
మరో మంత్రి పదవి కోసం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.
వీరిలో సుదర్శన్‌రెడ్డి వైపు ముఖ్యమంత్రి మొగ్గు చూపే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వివరాలు
రాజగోపాల్‌రెడ్డి విషయంలో ఏం జరుగుతుందో?
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభిస్తుందనే ప్రచారం చాలాకాలంగా కొనసాగుతోంది.
అయితే కోమటిరెడ్డి సోదరులు ఇద్దరికీ ఒకేసారి మంత్రివర్గంలో అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సానుకూలంగా లేదనే మరో వాదన వినిపిస్తోంది.
ఈ అంశంపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వివరాలు
స్పీకర్ మార్పుపైనా చర్చ
మరోవైపు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కూడా మంత్రివర్గంలో చోటు కోరుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటే స్పీకర్ పదవిని మంత్రి లక్ష్మణ్‌కుమార్‌కు అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దీంతో మంత్రివర్గ విస్తరణతోపాటు స్పీకర్ పదవిలో మార్పు కూడా జరుగుతుందా అన్న చర్చ మొదలైంది.
మొత్తంగా శాసనసభ సమావేశాలకు ముందు, తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలపైనే తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.