Telangana: తెలంగాణలో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం.. వారపు మెనూ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రతిష్ఠాత్మకంగా 'ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్' పథకాన్ని ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి మెనూను విద్యాశాఖ ఖరారు చేసింది. 2026-27 విద్యా సంవత్సరంనుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు వారానికి ఆరు రోజుల పాటు వేడి వేడి, రుచికరమైన అల్పాహారం అందించనున్నారు.
వివరాలు
వారానికి ఐదు రకాల టిఫిన్లు.. పోషకాలపై దృష్టి
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పోషకాలు సమృద్ధిగా ఉన్న టిఫిన్లను మెనూలో చేర్చారు. విద్యాశాఖ ప్రకటించిన వివరాల ప్రకారం వారానికి ఈ విధంగా అల్పాహారం అందించనున్నారు: సోమవారం: దోసె-చట్నీ లేదా చపాతీ-కూర మంగళవారం: రెండు మిల్లెట్ ఇడ్లీలు-సాంబారు బుధవారం: రెండు పూరీలు-ఆలూ కుర్మా గురువారం: రెండు మిల్లెట్ ఇడ్లీలు-సాంబారు శుక్రవారం: మిల్లెట్ ఉప్మా లేదా పొంగల్-చట్నీ శనివారం: రెండు బోండాలు-చట్నీ ఇవి మాత్రమే కాకుండా, టిఫిన్‌తో పాటు పిల్లలకు అదనంగా పాలు, రాగి జావను అందించనున్నారు. వారానికి మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగి జావ ఇవ్వాలని నిర్ణయించారు.
వివరాలు
22 లక్షల మంది విద్యార్థులకు లాభం
ఈ పథకం ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులందరికీ వర్తిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందనున్నారు. విద్యార్థులు సౌకర్యంగా టిఫిన్ తీసుకునేందుకు ప్రతిరోజూ 45 నిమిషాల సమయాన్ని కేటాయించాలని ప్రభుత్వం సూచించింది. ఈ పథకం అమలుకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్‌లో కేటాయించింది. వివరాలు ఇలా ఉన్నాయి: పాఠశాల విద్యార్థుల టిఫిన్ కోసం: రూ. 540 కోట్లు పాల సరఫరా కోసం: రూ. 180 కోట్లు ఇంటర్ విద్యార్థుల కోసం అదనంగా: రూ. 56 కోట్లు
వివరాలు
తమిళనాడు మోడల్ అమలు
తమిళనాడులో విజయవంతంగా అమలవుతున్న బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. చెన్నై పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. ఆ హామీ మేరకు ఇప్పుడు అధికారులు మెనూ, విధివిధానాలను సిద్ధం చేసి, వచ్చే విద్యా సంవత్సరంనుంచి అమలుకు సన్నద్ధమవుతున్నారు.