LOADING...
Telangana: జీహెచ్‌ఎంసీకి బదులు క్యూర్‌-2026.. ప్రజాభిప్రాయాలు,సూచనలకు ఆహ్వానం
జీహెచ్‌ఎంసీకి బదులు క్యూర్‌-2026.. ప్రజాభిప్రాయాలు,సూచనలకు ఆహ్వానం

Telangana: జీహెచ్‌ఎంసీకి బదులు క్యూర్‌-2026.. ప్రజాభిప్రాయాలు,సూచనలకు ఆహ్వానం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 06, 2026
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

జీహెచ్‌ఎంసీ చట్టానికి ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్న క్యూర్‌-2026 (కోర్ అర్బన్ రీజియన్) చట్టానికి సంబంధించిన ముసాయిదాను తెలంగాణ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. ఈ ముసాయిదాపై ప్రజలు, నిపుణులు తమ అభిప్రాయాలు, సూచనలు ఈ నెల 24వ తేదీ వరకు తెలియజేయవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం జీహెచ్‌ఎంసీ అధికారిక వెబ్‌సైట్‌లో ముసాయిదా బిల్లు కాపీని అందుబాటులో ఉంచింది. బిల్లు ప్రతిని తెరిచిన తర్వాత వెబ్‌పేజీ చివర కనిపించే 'Proceed to Feedback' లింక్‌ను క్లిక్ చేస్తే ప్రత్యేక ఫారం తెరుచుకుంటుంది. అందులో తమ సూచనలు, అభిప్రాయాలను నమోదు చేసి నేరుగా ప్రభుత్వానికి పంపే అవకాశం కల్పించారు. దీంతో దాదాపు ఏడు దశాబ్దాలుగా అమల్లో ఉన్న జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో కొత్త చట్టం అమల్లోకి రానుంది.

వివరాలు 

కొనసాగనున్న కీలక నిబంధనలు

ప్రస్తుతం అమల్లో ఉన్న జీహెచ్‌ఎంసీ చట్టంలోని అనేక ప్రధాన అంశాలను కొత్త చట్టంలోనూ కొనసాగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. కార్పొరేషన్లు, స్టాండింగ్ కమిటీలు, కమిషనర్ల అధికారాలు, వార్డు కమిటీలు, ఎన్నికల నిర్వహణ, ఆస్తిపన్ను మదింపు, రుణాల సేకరణ అధికారాలు, జంతు సంరక్షణ వంటి అంశాలు యథాతథంగా కొనసాగనున్నాయి. అదే సమయంలో కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు ప్రాతినిధ్యం కల్పించే కొత్త నిబంధనను చేర్చారు. మరోవైపు కార్పొరేటర్ల అనర్హతకు సంబంధించిన నిబంధనను ముసాయిదా నుంచి తొలగించారు.

వివరాలు 

ఆస్తిపన్ను విధానంలో మార్పులు

ప్రస్తుతం పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంటి అద్దె ఆధారంగా ఆస్తిపన్ను నిర్ణయిస్తుండగా, రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో భూమి విలువ ఆధారిత పన్ను విధానం అమలులో ఉంది. అదే విధానాన్ని క్యూర్‌ పరిధిలో కూడా అమలు చేయాలని ముసాయిదా బిల్లు ప్రతిపాదిస్తోంది. దీంతో భవిష్యత్తులో ఆస్తిపన్ను లెక్కింపు విధానంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు 

సమగ్ర పట్టణ పాలనకు ప్రత్యేక వ్యవస్థ

పట్టణ పాలనను మరింత సమన్వయంతో నిర్వహించేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేయాలని ముసాయిదాలో పేర్కొన్నారు. అలాగే హైడ్రా, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, వాతావరణ మార్పులు, వారసత్వ పరిరక్షణ, ఆహార భద్రత, లింగ సమానత్వం, కార్మిక సంక్షేమం వంటి రంగాల కోసం ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

Advertisement

వివరాలు 

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త చట్టం

కోర్ అర్బన్ రీజియన్(ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ బిల్లు)పేరుతో రూపొందించిన ఈ ముసాయిదాపై ప్రజల నుంచి వచ్చిన సూచనలు,అభిప్రాయాలను పరిశీలించి అవసరమైన మార్పులు చేసి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చట్టాన్ని ఆమోదింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న హైదరాబాద్ మహానగరపాలక సంస్థ-1955చట్టానికి ఇది ప్రత్యామ్నాయంగా రానుంది. సుమారు 71ఏళ్ల క్రితం 15లక్షల జనాభా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్‌) కోసం రూపొందించిన చట్టానికే జీహెచ్‌ఎంసీ ఏర్పడిన తర్వాత పేరు మార్చారు. ఇటీవల ప్రభుత్వం జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా పునర్విభజించింది. ప్రస్తుతం ఆ మూడు కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీ చట్టం కిందే పనిచేస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చట్టంలో సమగ్ర మార్పులు చేసి క్యూర్‌-2026బిల్లును రూపొందించింది.

వివరాలు 

డిజిటల్ పాలనకు ప్రాధాన్యం

విపత్తుల సమయంలో అన్ని ప్రభుత్వ సంస్థల మధ్య వేగవంతమైన సమన్వయం కోసం క్యూర్ స్మార్ట్ గవర్నెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముసాయిదా ప్రతిపాదిస్తోంది. అలాగే ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి క్యూర్ అప్పిలేట్ అథారిటీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ప్రణాళికాబద్ధ అభివృద్ధికి కొత్త నిబంధనలు పట్టణ అభివృద్ధిని మరింత ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లేందుకు అక్రమ నిర్మాణాలపై భారీ జరిమానాలు విధించే ప్రతిపాదనను బిల్లులో చేర్చారు. నిర్మాణ అనుమతులను వేగంగా జారీ చేయడం, అన్ని రకాల వ్యాపారాలకు ఒకే ట్రేడ్ లైసెన్స్ విధానం అమలు చేయడం, నైట్ ఎకానమీ అభివృద్ధికి ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించడం వంటి అంశాలకు కూడా క్యూర్‌-2026 బిల్లులో ప్రాధాన్యం ఇచ్చారు.

Advertisement