Telangana Election : నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ..అక్కడ ఇంత మందే ఉండాలంట
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 పోరులో మరో కీలక ఘట్టానికి నేడు తెరలేవనుంది. ఈ మేరకు ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆర్వో(RETURNING OFFICER) కార్యాలయాల వద్ద పోలీసులు అంక్షలు విధించారు. ఈ క్రమంలోనే ఆర్వో కార్యాలయాల్లోకి అభ్యర్థులు సహా మరో ఐదుగురు మాత్రమే వెళ్లేందుకు మాత్రమే అవకాశం ఇవ్వనున్నారు. నేటి నుంచి నవంబర్ 10 వరకు నామపత్రాలను తీసుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.ఒక అభ్యర్థి రెండుకు మించిన స్థానాల్లో పోటీ చేసేందుకు వీల్లేదు.
సువిధ పోర్టల్ ద్వారానూ నామపత్రాలు దాఖలు చేసుకోవచ్చు
మరోవైపు ఆర్వో కేంద్రాల వద్ద వంద మీటర్ల పరిధిలో కేవలం మూడు వాహనాలకు మాత్రమే అనుమతించనున్నారు. ఈ సారి సువిధ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో నామినేషన్ వేసే అవకాశం సైతం కల్పించారు. కానీ ఆన్ లైన్ నామినేషన్ వేస్తే అందుకు సంబంధించిన ప్రింటెడ్ కాపీని ఆర్వోకు అందించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం చెబుతోంది. ఇదే సమయంలో నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 చివరి రోజుగా గతంలోనే సీఈసీ పేర్కొంది. నవంబర్ 30న ఓటింగ్, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఒక్కో అభ్యర్థి ఒక్కో నియోజకవర్గం నుంచి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయొచ్చు. ఆర్వో పరిధిలో వంద మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు.