Telangana: తెలంగాణలో భారీగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు.. 2026-27కు కొత్తగా 810 రాక
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) శుభవార్త చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌ఎంసీ తాజాగా విడుదల చేసిన సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం తెలంగాణకు అదనంగా 810 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. కొత్తగా మంజూరైన సీట్లలో ప్రభుత్వ వైద్య కళాశాలలకు 110 సీట్లు, ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు 600 సీట్లు, డీమ్డ్ వైద్య విశ్వవిద్యాలయాల పరిధిలోని మెడికల్ కళాశాలలకు 100 సీట్లు కేటాయించారు. ఈ మేరకు ఎన్‌ఎంసీ బుధవారం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
వివరాలు
రాష్ట్రంలోని మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 9,650
ఈ అదనపు ఎంబీబీఎస్ సీట్లు కూడా ఈ ఏడాది నిర్వహించే నీట్ కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయనున్నారు.
గత 2025-26 విద్యా సంవత్సరంలో తెలంగాణలో మొత్తం 8,840 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉండగా, తాజాగా మంజూరైన 810 సీట్లతో రాష్ట్రంలోని మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 9,650కు చేరింది.
దీంతో నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు రాష్ట్రంలో వైద్య విద్యలో ప్రవేశ అవకాశాలు మరింత విస్తరించనున్నాయి.