Telangana: కామారెడ్డి వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది విద్యార్థులపై సస్పెన్షన్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని కామారెడ్డి వైద్య కళాశాల బాలుర వసతిగృహంలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో రెండో సంవత్సరం చదువుతున్న 14 మంది విద్యార్థులపై కళాశాల అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. అక్టోబరు 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. అనుమతులు లేకుండానే సీనియర్ విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులు ఉంటున్న వసతిగృహంలోకి ప్రవేశించారు. అక్కడ వారితో అనుచితంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో ఇబ్బందులు ఎదుర్కొన్న పలువురు బాధిత విద్యార్థులు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) యాంటీ ర్యాగింగ్ సెల్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు.
వివరాలు
బాధ్యులైన విద్యార్థులపై కళాశాల అధికారులు చర్యలు
ఫిర్యాదులపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులకు ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారించే వీడియో ఆధారాలు లభించాయి.
దీంతో బాధ్యులైన విద్యార్థులపై కళాశాల అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఈ ఘటనలో కీలక పాత్ర పోషించిన నలుగురు విద్యార్థులను ఆరు నెలలపాటు, మరో పది మందిని నాలుగు నెలలపాటు సస్పెండ్ చేశారు.
మరోవైపు, వైద్య కళాశాల వసతిగృహాలను అద్దె భవనాల్లో నిర్వహించడం, అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం ఈ ఘటనకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.