Loading...
Telangana: గృహజ్యోతి లబ్ధిదారులకు ట్రూఅప్‌ ఛార్జీల నుంచి ఊరట
గృహజ్యోతి లబ్ధిదారులకు ట్రూఅప్‌ ఛార్జీల నుంచి ఊరట

Telangana: గృహజ్యోతి లబ్ధిదారులకు ట్రూఅప్‌ ఛార్జీల నుంచి ఊరట

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2026
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. కరెంటు బిల్లుల్లో ఈ నెల నుంచి అమలవుతున్న ట్రూఅప్‌ ఛార్జీల భారాన్ని వారిపై పడకుండా నిర్ణయం తీసుకుంది. ఈ ఛార్జీలను లబ్ధిదారుల తరఫున ప్రభుత్వమే డిస్కంలకు చెల్లించనుంది. దీంతో అర్హులైన వినియోగదారులకు ట్రూఅప్‌ ఛార్జీలు కలిపినా జీరో బిల్లులే జారీ అవుతున్నాయి. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగించే 54,79,383 కనెక్షన్లకు గృహజ్యోతి పథకం కింద డిస్కంలు ప్రతి నెలా జీరో బిల్లులు అందిస్తున్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని వర్గాల విద్యుత్తు వినియోగదారుల బిల్లుల్లో ట్రూఅప్‌ ఛార్జీలను కలిపి వసూలు చేస్తున్నారు. అయితే గృహజ్యోతి లబ్ధిదారుల విషయంలో మాత్రం ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది.

వివరాలు 

వినియోగించిన విద్యుత్తు ఆధారంగా ట్రూఅప్‌ ఛార్జీల నిర్ణయం 

గతంలో 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో వినియోగించిన విద్యుత్తు ఆధారంగా ట్రూఅప్‌ ఛార్జీలను నిర్ణయించారు.

ఈ నెల బిల్లులో యూనిట్‌కు 30 పైసలు, వచ్చే నెల నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున 24 నెలల పాటు డిస్కంలు వసూలు చేయనున్నాయి.

గృహజ్యోతి పథకం లబ్ధిదారులు గతంలో నెలకు 200 యూనిట్లకు మించి విద్యుత్తు వినియోగించినప్పటికీ, ప్రస్తుతం వారి బిల్లుల్లో విధిస్తున్న ట్రూఅప్‌ ఛార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తుందని డిస్కంలు స్పష్టం చేశాయి.

దీంతో గత రెండేళ్లలో విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం పథకం అర్హత పొందిన వినియోగదారులకు ఈ ఛార్జీల భారం ఉండదు.

వివరాలు 

ప్రభుత్వానికి పెరగనున్న ఆర్థిక భారం

గృహజ్యోతి పథకం ప్రారంభమైన 2024లో ప్రభుత్వం ప్రతి నెలా డిస్కంలకు సుమారు రూ.170కోట్ల వరకు చెల్లించేది.

ప్రస్తుతం ఈ మొత్తం నెలకు రూ.210కోట్లకు చేరింది.తాజాగా ట్రూఅప్‌ ఛార్జీలను కూడా ప్రభుత్వం భరించనుండటంతో అదనపు ఆర్థిక భారం పడనుంది.

ఈ నెలలోనే ట్రూఅప్‌ ఛార్జీల కింద రూ.16కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

రాబోయే 24నెలల్లో గృహజ్యోతి లబ్ధిదారులకు సంబంధించి ఈ ఛార్జీల కోసం ప్రభుత్వం మొత్తం సుమారు రూ.500కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని డిస్కంల వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు,రేషన్‌కార్డు ఉన్నప్పటికీ ఇప్పటివరకు జీరో బిల్లు పొందని వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది.

దీంతో గృహజ్యోతి పథకం కింద లబ్ధి పొందే వినియోగదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ADVERTISEMENT