Page Loader
విద్యార్థులకు 1.17కోట్ల నోట్‌బుక్‌లను ఉచితంగా అందించనున్న తెలంగాణ ప్రభుత్వం 
విద్యార్థులకు 1.17కోట్ల నోట్‌బుక్‌లను ఉచితంగా అందించనున్న తెలంగాణ ప్రభుత్వం

విద్యార్థులకు 1.17కోట్ల నోట్‌బుక్‌లను ఉచితంగా అందించనున్న తెలంగాణ ప్రభుత్వం 

వ్రాసిన వారు Stalin
Jun 01, 2023
02:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

2023-24 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, మోడల్ స్కూల్స్, టీఆర్ఈఐఎస్, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీ‌లల్లోని 6వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో విద్యార్థికి తరగతిని బట్టి ఆరు నుంచి 14 నోట్‌బుక్‌లను ప్రభుత్వం అందించనుంది. ఈ విద్యా సంవత్సరానికి రూ.56.24 కోట్ల అంచనా వ్యయంతో 1,17,88,699 నోట్‌బుక్‌లను సేకరించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.

తెలంగాణ

12,39,415 మంది విద్యార్థులకు లబ్ధి 

6వ, 7వ తరగతి విద్యార్థులకు ఒకరికి 200 పేజీలతో కూడిన ఆరు నోట్‌బుక్‌లను అందించాలని, ప్రతి 8వ తరగతి విద్యార్థికి ఏడు నోట్‌బుక్‌లను ప్రభుత్వం సరఫరా చేయనుంది. అదేవిధంగా, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రెసిడెన్షియల్ పాఠశాలల్లోని 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థులకు 14 నోట్‌బుక్‌లు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు 12 నోట్‌బుక్‌లు అందిస్తారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందజేస్తున్న ప్రభుత్వం, తాజాగా తీసుకున్న నిర్ణయంతో మొత్తం 12,39,415 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరానికి రూ.34.70 కోట్ల అంచనా వ్యయంతో 33,82,371 ఉచిత వర్క్‌బుక్‌లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.