LOADING...
Medaram: మేడారం మహాజాతరకు భారీ ఏర్పాట్లు.. మూడు కోట్ల మంది భక్తుల వస్తారని అంచనా
మేడారం మహాజాతరకు భారీ ఏర్పాట్లు.. మూడు కోట్ల మంది భక్తుల వస్తారని అంచనా

Medaram: మేడారం మహాజాతరకు భారీ ఏర్పాట్లు.. మూడు కోట్ల మంది భక్తుల వస్తారని అంచనా

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2026
12:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

అతి పెద్ద గిరిజన పండుగగా పేరొందిన మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు చేపడుతోంది. కోట్ల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో అభివృద్ధి పనులు కూడా తుదిదశకు చేరుకున్నాయి.ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు మేడారం జాతర నిర్వహించనున్నారు. మేడారం జాతర ఏర్పాట్లను సీఎస్ రామకృష్ణారావు, ములుగు జిల్లా కలెక్టర్ సహా పలువురు ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ,ఈ ఏడాది దాదాపు మూడు కోట్ల మంది భక్తులు జాతరకు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

వివరాలు 

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరుగుతుందని స్పష్టం చేశారు. ఈసారి భక్తుల సంఖ్య గత ఏడాదిల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్న మంత్రి సీతక్క, అంచనాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జాతరను సజావుగా, భక్తుల ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని, పూర్తి నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. జాతర సందర్భంగా మరుగుదొడ్ల సంఖ్యను పెంచడం, తగినంత తాగునీరు అందుబాటులో ఉంచడం, రవాణా సౌకర్యాలను మరింత బలోపేతం చేయడం, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు.

వివరాలు 

సేవల కోసం 2 వేల మంది గిరిజన యువ వాలంటీర్లు 

జాతరకు సంబంధించిన సమాచారం భక్తులకు సులభంగా అందించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్, క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టడంతో పాటు, ప్రత్యేక లోగో, వీడియోలను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. ఈ మహాజాతర నిర్వహణ కోసం 21 విభాగాలకు చెందిన 42 వేల మందికి పైగా అధికారులు, సిబ్బందిని నియమించడంతో పాటు, 2 వేల మంది గిరిజన యువ వాలంటీర్లను కూడా సేవల కోసం వినియోగిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. మేడారం జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, టీజీఎస్ఆర్టీసీ 3,495 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.

Advertisement

వివరాలు 

భక్తుల రద్దీ పెరిగితే, అదనంగా మరిన్ని బస్సులు..

గత అనుభవాలను పరిగణలోకి తీసుకుని, ఈసారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. అంచనాలను మించి భక్తుల రద్దీ పెరిగితే, అదనంగా మరిన్ని బస్సులు నడిపే విధంగా ఆర్టీసీ సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మేడారం జాతర ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీపై 50 శాతం అదనపు రుసుము వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.

Advertisement

వివరాలు 

జాతర సంబంధిత సమాచారం కోసం..

ప్రత్యేక పండుగలు, జాతరలు, ఉత్సవాల సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు చార్జీలు పెంచుకునేందుకు ఆర్టీసీకి ఉన్న అనుమతి మేరకు,ఇదే విధానం మేడారం ప్రత్యేక బస్సులకు కూడా వర్తించనుంది. భక్తులకు అవసరమైన సమాచారం అందించడంతో పాటు, ఏవైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు వెంటనే స్పందించేందుకు మాస్టర్ కంట్రోల్ రూమ్‌తో పాటు హెల్ప్‌డెస్క్‌లను కూడా ఏర్పాటు చేశారు. జాతర సంబంధిత సమాచారం కోసం 08717 - 243055, 9491935321, 9493416719, 7382760241, 7382906844 హెల్ప్‌లైన్ నెంబర్లను సంప్రదించవచ్చని ములుగు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement