
Telangana: జూన్ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోలు.. పౌరసరఫరాల సంస్థ నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
రబీ (యాసంగి) కాలానికి చెందిన వడ్లను రైతుల నుంచి జూన్ నెలాఖరుకల్లా సేకరించాలని తెలంగాణ పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది.
ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 8,209 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఇప్పటికే కార్యాచరణ రూపొందించింది.
జిల్లాల వారీగా ధాన్యోత్పత్తిని దృష్టిలో పెట్టుకొని కేంద్రాల సంఖ్యను నిర్ణయించారు.
వరి కోతలు ప్రారంభమైన ప్రాంతాల్లో ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు సంస్థ అధికారులు వెల్లడించారు.
ఈ మంగళవారం నాటికి 1,838 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇప్పటికే రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 9వ తేదీ వరకు మొత్తం 95,131 టన్నుల వరి కొనుగోలు చేశారు.
వివరాలు
అదనపు బోనస్ మొత్తం రూ.4.99 కోట్లు
ఇందులో 9,973 టన్నుల దొడ్డు రకం ధాన్యం కాగా, మిగిలిన 85,158 టన్నులు సన్న రకం వరి.
ఇప్పటివరకు ఈ వడ్లకు కట్టబెట్టిన ఎంఎస్‌పీ మొత్తం విలువ రూ.220.70 కోట్లు కాగా, అందులో రూ.46.54 కోట్లను ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేశారు.
రైతుల నుంచి సేకరించిన సన్న రకం వరికి ప్రభుత్వం ఇచ్చే అదనపు బోనస్ మొత్తం రూ.4.99 కోట్లుగా ఉంది.
అయితే, ఈ చెల్లింపులు ఇంకా ప్రారంభించాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాలకు చేరిన మొత్తం ధాన్యంలో 92,724 టన్నులను ఇప్పటికే మిల్లులకు తరలించగా, మరో 2,407 టన్నులు కేంద్రాల్లోనే ఉన్నాయి.
వివరాలు
ధాన్యం కొనుగోళ్లలో ముందుండే జిల్లాలు: నిజామాబాద్, నల్గొండ
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కన్నా ముందుగా నిజామాబాద్,నల్గొండ జిల్లాల్లో వరి సాగు, కోతలు మొదలవుతాయి.
అందువల్ల ఈ జిల్లాలు ధాన్యం కొనుగోళ్లలోనూ ముందున్నాయి. రాష్ట్రంలోని 1,838 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతుండగా, ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 464 కేంద్రాలు ఉన్నాయి.
ఆ తర్వాతి స్థానంలో నల్గొండ ఉంది, ఇక్కడ 250 కేంద్రాలు పనిచేస్తున్నాయి.
కామారెడ్డి జిల్లాలో 241 కేంద్రాలు, సిద్దిపేటలో 230 కేంద్రాలు ఈ సీజన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
యాసంగి సీజన్ మొత్తం మీద రాష్ట్రంలో సుమారుగా 1.37 కోట్ల టన్నుల వరి దిగుబడి ఉండొచ్చని అంచనా వేసారు.
ఇందులో నుంచి 70.13 లక్షల టన్నులను కొనుగోలు చేయాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.