Loading...
Telangana: తెలంగాణ టీడీఆర్ పోర్టల్‌లో ఆధార్ అథెంటికేషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ టీడీఆర్ పోర్టల్‌లో ఆధార్ అథెంటికేషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana: తెలంగాణ టీడీఆర్ పోర్టల్‌లో ఆధార్ అథెంటికేషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2026
08:33 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో టీడీఆర్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) ఆన్‌లైన్ పోర్టల్‌లో ఆధార్ ఆధారిత అథెంటికేషన్‌ను ప్రవేశపెడుతూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీఆర్ లావాదేవీల్లో మోసాలు, నకిలీ రిజిస్ట్రేషన్లు, అనధికారిక లాగిన్‌లను అరికట్టడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. కొత్త విధానం ప్రకారం ఆస్తి యజమానులు, బిల్డర్లు, డెవలపర్లు టీడీఆర్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, లాగిన్ అవడం, దరఖాస్తులు సమర్పించడం వంటి సేవల కోసం ఆధార్ ధ్రువీకరణను ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఆస్తులకు సంబంధించిన వివరాలను డేటాబేస్‌తో అనుసంధానం చేయడం సులభమవుతుంది.

వివరాలు 

టీడీఆర్ సేవల కోసం ఆధార్ వినియోగాన్ని ప్రభుత్వం తప్పనిసరి కాదు 

వినియోగదారులతో పాటు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారుల పరిపాలనా లావాదేవీలకు కూడా ఈ విధానం వర్తిస్తుంది.

దీంతో రికార్డుల్లో కచ్చితత్వం పెరగడంతో పాటు, టీడీఆర్ ప్రక్రియలో జవాబుదారీతనం మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే, టీడీఆర్ సేవల కోసం ఆధార్ వినియోగాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేయలేదు. ఈ విధానం పూర్తిగా స్వచ్ఛందమని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఆధార్ కార్డుదారుల ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఎవరైనా ఆధార్‌ను ఉపయోగించడానికి ఇష్టపడకపోయినా, సాంకేతిక సమస్యల కారణంగా వినియోగించలేకపోయినా వారికి సేవలను నిరాకరించబోమని ప్రభుత్వం వెల్లడించింది.

వివరాలు 

ఆధార్ వినియోగం స్వచ్ఛందం, ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలకు అనుమతి

అలాంటి వారు పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఇతర ఫొటో గుర్తింపు కార్డులను ప్రత్యామ్నాయ ధ్రువీకరణ పత్రాలుగా సమర్పించవచ్చు.

ఆధార్ చట్టం, సంబంధిత నిబంధనలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పురపాలక శాఖ తెలిపింది.

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)తో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ విధానానికి ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం పేర్కొంది.

ADVERTISEMENT