Telangana: తెలంగాణలో 369 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు.. యూనిట్‌కు రూ.13 ఛార్జింగ్ ధర
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ, అప్‌గ్రేడేషన్, వాణిజ్య నిర్వహణ కోసం టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. దీనికి సంబంధించి ప్రీ-బిడ్ సమావేశాలు నిర్వహించారు. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైన ఛార్జింగ్ మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకురావడమే ఈ చర్య ప్రధాన ఉద్దేశం.
వివరాలు
దేశంలో నాలుగో స్థానం..
ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల వద్ద విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో ఉంది.
అదే సమయంలో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా క్రమంగా పెరుగుతోంది.
దీంతో కొత్త ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు ఇప్పటికే ఉన్న మౌలిక వసతులను సమర్థంగా నిర్వహించడం, అవసరానికి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయడం కీలకంగా మారింది.
369 స్టేషన్లు ఎక్కడంటే..
తెలంగాణలో ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TG REDCO) ఈ చర్యలు చేపడుతోంది.
ప్రతిపాదించిన 369 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో 200 కేంద్రాలు గ్రేటర్ హైదరాబాద్,సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఏర్పాటు చేయనున్నారు.
మిగిలిన 169 ఛార్జింగ్ స్టేషన్లను వరంగల్,ఖమ్మం,కరీంనగర్,నిజామాబాద్,ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలో ఏర్పాటు చేస్తారు.
వివరాలు
యూనిట్‌కు రూ.13.. అదనంగా జీఎస్టీ
ఈవీ ఛార్జింగ్‌కు అయ్యే విద్యుత్ ధరను యూనిట్‌కు రూ.13గా నిర్ణయించారు. దీనికి అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఒప్పందం అమల్లో ఉండే మొత్తం కాలంలో వినియోగదారులకు ఇదే ఛార్జింగ్ ధర వర్తిస్తుందని TG REDCO వెల్లడించింది.
ప్రైవేట్ ఆపరేటర్లకు టెండర్లు..
TG REDCO ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ప్రైవేట్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్ల (CPOలు) నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నారు.
ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ, ఇతర సంబంధిత కార్యకలాపాలను ఎంపికైన సీపీఓలు చేపట్టాల్సి ఉంటుంది.
హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే అభివృద్ధి చేసిన ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల నిర్వహణ, అప్‌గ్రేడేషన్, వాణిజ్య కార్యకలాపాల బాధ్యతలు కూడా ఎంపికైన ఆపరేటర్లకే అప్పగించనున్నారు.
వివరాలు
10 ఏళ్లపాటు నిర్వహణ..
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పంద కాలం 10 సంవత్సరాలుగా ఉంటుంది.
పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ఛార్జర్లను కనీసం 95 శాతం సమయం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిబంధనలు రూపొందించారు.
అంటే ఛార్జింగ్ కేంద్రాలు వినియోగదారులకు ఎక్కువ సమయం పనిచేసేలా నిర్వహించాల్సి ఉంటుంది.
169 స్టేషన్లకు పూర్తి బాధ్యత సీపీఓలదే..
TGNPDCL పరిధిలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న 169పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లకు సంబంధించి సర్వే నుంచి నిర్వహణ వరకు మొత్తం బాధ్యతలను ఎంపికైన సీపీఓలే చేపట్టాలి.
ఇందులో సర్వే, డిజైన్, పరికరాల సరఫరా,సివిల్ పనులు, ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్, కమిషనింగ్ వంటి పనులు ఉంటాయి.
స్టేషన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటి నిర్వహణ బాధ్యతలను కూడా 10ఏళ్లపాటు సీపీఓలే నిర్వర్తించాలి.
వివరాలు
PM E-DRIVE కింద సబ్సిడీ..
అర్హత కలిగిన బిడ్డర్లకు PM E-DRIVE పథకం కింద సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వర్తించే నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ సబ్సిడీ అందుతుంది.
రవాణా పరంగా తెలంగాణకు కీలక స్థానం..
తెలంగాణకు వ్యూహాత్మకంగా కీలకమైన భౌగోళిక స్థానం ఉందని TG REDCO వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు.
రాష్ట్రం మీదుగా అనేక జాతీయ రహదారులు, ప్రధాన రవాణా కారిడార్లు వెళ్తున్నాయని చెప్పారు.
దీంతో రాష్ట్రం గుండా భారీగా అంతర్‌రాష్ట్ర ప్రయాణాలు, సరకు రవాణా జరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన ఛార్జింగ్ మౌలిక వసతులను బలోపేతం చేయడం ప్రాధాన్యం సంతరించుకుందని పేర్కొన్నారు.