LOADING...
New Energy policy: తెలంగాణ కొత్త ఇంధన విధాన పత్రం విడుదలకు సిద్ధం.. ఎప్పుడంటే?
తెలంగాణ కొత్త ఇంధన విధాన పత్రం విడుదలకు సిద్ధం.. ఎప్పుడంటే?

New Energy policy: తెలంగాణ కొత్త ఇంధన విధాన పత్రం విడుదలకు సిద్ధం.. ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 07, 2025
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో రూపొందించిన కొత్త ఇంధన విధాన పత్రాన్ని (న్యూ ఎనర్జీ పాలసీ) జనవరి 9న విడుదల చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం, సచివాలయం ఎదురుగా నిర్వహించిన సమావేశంలో జెన్‌కో రాతపరీక్షల ద్వారా 315 సహాయ ఇంజినీర్‌ (ఏఈ) పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి ఇంధన పాలసీని అందించడంలో విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణను మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పలు ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందిన కొత్త ఇంధన విధానం అనేక అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి రూపొందించామని తెలిపారు.

Details

రామగుండంలో థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు

జెన్‌కో, సింగరేణి సంస్థ కాలరీస్‌ లిమిటెడ్‌ సంయుక్త భాగస్వామ్యంలో రామగుండంలో థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఒడిశాలోని సింగరేణికి కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్‌ను పూర్తిగా వినియోగించుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని భట్టి వివరించారు. చదువుకున్న యువకుడికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందని తెలిపారు. ఇక సింగరేణి ఆధ్వర్యంలో రూపొందించిన 'చెమట చుక్కలకు తర్ఫీదు' లోగోను భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. సింగరేణి కార్మికుల పిల్లలకు దేశ, విదేశాల్లో ఉన్నత విద్యా, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్‌, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబ్బీర్‌అలీ పాల్గొన్నారు.