Telangana: తెలంగాణ విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లకు త్వరలో బ్రేక్!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లు, ఇతర వాణిజ్య కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల కళాశాలలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో చోటుచేసుకున్న వరుస ప్రమాదాల్లో విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యార్థుల భద్రత విషయంలో కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది.
వివరాలు
ఇటీవల కాలేజీల్లో జరిగిన ప్రమాదాలు, విద్యార్థుల మరణాలే కారణం
ఇటీవల హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన దాండియా కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది.
సరైన భద్రతా ఏర్పాట్లు లేకుండానే కార్యక్రమం నిర్వహించడంతో ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.
మరో ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో జరిగిన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలోనూ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.
ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా విద్యా ప్రాంగణాల్లో నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని విద్యాశాఖను ఆదేశించింది.
వివరాలు
విద్య, క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలకే అనుమతి
క్యాంపస్లలో ఇకపై విద్య, క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలకే అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.
సినిమా ప్రమోషన్లు, ఇతర వాణిజ్య కార్యక్రమాలను పూర్తిగా నిషేధించాలని భావిస్తోంది.
పెద్ద ఎత్తున క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తే మాత్రం ముందస్తు అనుమతులు, భద్రతా ఏర్పాట్లు తప్పనిసరి చేయనున్నారు.
కార్యక్రమానికి ఎంతమంది హాజరవుతారు? ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? అనే వివరాలను ముందుగానే పోలీసు, అగ్నిమాపక శాఖలకు తెలియజేయాల్సి ఉంటుంది.
వివరాలు
నిబంధనలు మీరితే యాజమాన్యాలపై కఠిన చర్యలు, భారీ జరిమానాలు
కొత్త నిబంధనలను ఉల్లంఘించే విద్యాసంస్థల యాజమాన్యాలపై భారీ జరిమానాలు విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.
విద్యార్థుల భద్రతను పక్కనపెట్టి కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు వాణిజ్య ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయన్న విమర్శలు కూడా ఈ నిర్ణయానికి కారణమయ్యాయి.
ఇదే అంశంపై ఉన్నత విద్యామండలి ఛైర్మన్ సైతం ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ మార్గదర్శకాలపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది.