Loading...
Telangana: ఫ్యూచర్‌ సిటీలో మరో భారీ ప్రాజెక్టు.. యాచారం,కందుకూరులో డ్రోన్‌ హబ్
ఫ్యూచర్‌ సిటీలో మరో భారీ ప్రాజెక్టు.. యాచారం,కందుకూరులో డ్రోన్‌ హబ్

Telangana: ఫ్యూచర్‌ సిటీలో మరో భారీ ప్రాజెక్టు.. యాచారం,కందుకూరులో డ్రోన్‌ హబ్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2026
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ ఫ్యూచర్‌ సిటీ పరిసర ప్రాంతాల్లో మరో కీలక ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. డ్రోన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, యువతకు శిక్షణ ఇవ్వడం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రత్యేకంగా డ్రోన్‌ టెక్నాలజీ హబ్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. డ్రోన్ల తయారీ, నిర్వహణ, పైలట్ల శిక్షణ, డేటా విశ్లేషణ, పరిశోధన వంటి కార్యకలాపాలన్నింటికీ ఒకే వేదికను అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటికే ఫ్యూచర్‌ సిటీలో ఏరోస్పేస్‌, రక్షణ రంగాలకు సంబంధించిన ఉత్పత్తుల తయారీ కోసం ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వివరాలు 

ఈ అంశాలపై సమగ్ర అధ్యయనం

ఈ నేపథ్యంలో అదే ప్రాంతంలో డ్రోన్‌ సాంకేతిక రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తే ఏరోస్పేస్‌, రక్షణ పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక సహకారం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు.

ఇందుకోసం రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, యాచారం మండలాల పరిధిలో కొన్ని గ్రామాలను ప్రాథమికంగా పరిశీలిస్తున్నారు.

ఆయా ప్రాంతాల్లో భూముల లభ్యత, భౌగోళిక పరిస్థితులు, విమానయాన భద్రత, రవాణా సదుపాయాలు తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేయనున్నారు.

ప్రాజెక్టు ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు.

వివరాలు 

డ్రోన్‌ హబ్‌కు అనువైన భూముల అన్వేషణ

డ్రోన్‌ టెక్నాలజీ హబ్‌ ఏర్పాటులో భూముల ఎంపిక అత్యంత కీలకంగా మారింది.

డ్రోన్ల ప్రయోగాత్మక పరీక్షలు, వాటిని ఎగరేయడం, నియంత్రించడం, అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా ల్యాండింగ్‌ చేయడం వంటి కార్యకలాపాలకు విశాలమైన మైదాన ప్రాంతాలు అవసరం.

అందువల్ల చుట్టుపక్కల ఎత్తైన భవనాలు, విద్యుత్తు తీగలు, కొండలు, ఇతర అడ్డంకులు లేని ప్రాంతాలకు అధికారులు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

ఈ క్రమంలో కొంగరకలాన్‌ నుంచి ఆమనగల్లు వరకు నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్‌-1 పరిసర ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నారు.

ఈ రహదారి నిర్మాణంలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో కొండలు, గుట్టలను చదును చేస్తున్నారు.

దీంతో సమీపంలో అందుబాటులోకి వచ్చే మైదాన భూములను డ్రోన్‌ హబ్‌ అవసరాలకు వినియోగించుకునే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

డ్రోన్‌ హబ్‌కు అనువైన భూముల అన్వేషణ

మరోవైపు డ్రోన్లు నిర్దిష్ట ఎత్తుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో విమానయాన భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ముఖ్యంగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి తగినంత దూరంలో హబ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

విమానాల రాకపోకలు, పైలట్ల విధులు, విమానాశ్రయ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా పౌర విమానయాన నిబంధనలకు అనుగుణంగా స్థలాన్ని ఎంపిక చేయనున్నారు.

డ్రోన్ల ఎగురవేతకు అనుమతించే ప్రాంతాలు, నిషేధిత ప్రాంతాలు, ఎత్తులకు సంబంధించిన పరిమితులు, పరీక్షల నిర్వహణకు అవసరమైన భద్రతా ప్రమాణాలపై కూడా అధ్యయనం చేయనున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

శిక్షణ నుంచి పరిశోధనల వరకు..

ప్రతిపాదిత డ్రోన్‌ టెక్నాలజీ హబ్‌ను కేవలం డ్రోన్లను నడపడం నేర్పించే శిక్షణ కేంద్రంగానే కాకుండా సమగ్ర సాంకేతిక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం యోచిస్తోంది.

డ్రోన్‌ పైలట్లుగా ఎదగాలనుకునే యువతకు ప్రత్యేక శిక్షణ అందించడంతోపాటు ఇంజినీరింగ్‌ విద్యార్థులు,సాంకేతిక నిపుణులకు అధునాతన పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

డ్రోన్ల రూపకల్పన,విడిభాగాల తయారీ, సెన్సార్ల వినియోగం,బ్యాటరీ సామర్థ్యం,నావిగేషన్‌ వ్యవస్థలు,కృత్రిమ మేధ (ఏఐ),మెషిన్‌ లెర్నింగ్‌,డేటా విశ్లేషణ వంటి అంశాల్లో పరిశోధనలకు అవకాశం కల్పించనున్నారు.

అలాగే డ్రోన్లలో వినియోగించే సాఫ్ట్‌వేర్‌, కెమెరాలు,సమాచార ప్రసార వ్యవస్థలు, ఆటోమేటిక్‌ నియంత్రణ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రత్యేక ప్రయోగశాలలను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలించవచ్చు.

ముఖ్యంగా ఏరోస్పేస్‌, రక్షణ రంగ పరిశ్రమలకు అవసరమైన ప్రత్యేక డ్రోన్ల అభివృద్ధికి ఈ కేంద్రం దోహదపడనుంది.

వివరాలు 

రక్షణ రంగం నుంచి వైద్య సేవల వరకు..

గతంలో ప్రధానంగా సైనిక, రక్షణ అవసరాలకే పరిమితమైన డ్రోన్ల వినియోగం ప్రస్తుతం అనేక రంగాలకు విస్తరించింది.

సరిహద్దుల పర్యవేక్షణ, నిఘా, రక్షణ కార్యకలాపాల్లో ఇవి కీలకంగా మారాయి.

వ్యవసాయ రంగంలో పురుగుమందుల పిచికారీ, పంటల ఆరోగ్యాన్ని పరిశీలించడం, భూముల సర్వే, నీటి వనరుల పర్యవేక్షణకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.

ప్రకృతి విపత్తుల సమయంలోనూ వీటి సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.

వరదలు, అగ్నిప్రమాదాలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పరిస్థితులను అంచనా వేయడానికి డ్రోన్లను వినియోగిస్తున్నారు.

వైద్య రంగంలో అత్యవసర మందులు, రక్త నమూనాలు, టీకాలు, ఇతర వైద్య పరికరాలు, సామగ్రిని వేగంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు డ్రోన్‌ సేవలపై ప్రయోగాలు, వినియోగం పెరుగుతున్నాయి.

వివరాలు 

రక్షణ రంగం నుంచి వైద్య సేవల వరకు..

నిర్మాణ రంగంలో భవనాలు, రహదారులు, భారీ ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిని పర్యవేక్షించడానికి డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి.

సినిమా చిత్రీకరణలు, వివాహ వేడుకలు, ప్రభుత్వ కార్యక్రమాలు, క్రీడా పోటీల్లోనూ వీటి వినియోగం సాధారణమైంది.

భవిష్యత్తులో మనుషులను సైతం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లగల సామర్థ్యమున్న డ్రోన్‌ వాహనాల అభివృద్ధి కూడా కొనసాగుతోంది.

ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని డ్రోన్ల తయారీ, నిర్వహణ, సాఫ్ట్‌వేర్‌, భద్రతా వ్యవస్థలపై పరిశోధనలు నిర్వహించే కేంద్రంగా ఫ్యూచర్‌ సిటీ డ్రోన్‌ హబ్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

వివరాలు 

ఇన్వెస్ట్‌ తెలంగాణ సమిట్‌లో కీలక చర్చలు

డ్రోన్‌ సాంకేతిక పరిజ్ఞానానికి భవిష్యత్తులో ఉన్న అవకాశాలు, తెలంగాణలో ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమిట్‌ 2.0లో చర్చించనున్నారు.

ఈ సమావేశంలో అధికారులు, సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించనున్నారు.

డ్రోన్ల తయారీ సంస్థలను తెలంగాణకు ఆకర్షించడం, పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయడం, యువతకు నైపుణ్య శిక్షణ అందించడం వంటి అంశాలపై సమాలోచనలు జరగనున్నాయి.

వివరాలు 

ఇన్వెస్ట్‌ తెలంగాణ సమిట్‌లో కీలక చర్చలు

అంతర్జాతీయంగా డ్రోన్‌ మార్కెట్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఈ రంగానికి అనుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని సృష్టించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ముఖ్యంగా ఫ్యూచర్‌ సిటీలో ప్రతిపాదించిన ఏరోస్పేస్‌, రక్షణ పరిశ్రమల క్లస్టర్‌తో డ్రోన్‌ టెక్నాలజీ హబ్‌ను అనుసంధానిస్తే ఒకే ప్రాంతంలో తయారీ, పరిశోధన, ప్రయోగాత్మక పరీక్షలు, శిక్షణ వంటి కార్యకలాపాలను నిర్వహించే అవకాశం ఉంటుంది.

దీనివల్ల డ్రోన్‌ రంగంలో పెట్టుబడులు పెరగడంతోపాటు సాంకేతిక నైపుణ్యం కలిగిన యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే వీలుంది.

ADVERTISEMENT