Telangana: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బస్ స్టేషన్లలో ఫ్రీ వైఫై
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని బస్ స్టేషన్లలో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రద్దీ ఎక్కువగా ఉండే బస్ స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. రోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే బస్ స్టేషన్లలో మౌలిక వసతులను మెరుగుపరచడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 5 వేల మందికిపైగా ప్రయాణికులు వచ్చే 86 బస్ స్టేషన్లను ఆర్టీసీ గుర్తించింది. వీటిలో దశలవారీగా ఉచిత వైఫై సేవలను ప్రారంభించనుంది. ఇప్పటికే గుర్తించిన బస్ స్టేషన్లలో ఒక్కో కంట్రోలర్‌ను నియమించింది. ప్రయాణికులు బస్సుల వివరాలు, రాకపోకల సమయాలను సులభంగా తెలుసుకునేందుకు ప్రత్యేక ఫోన్ నంబర్లను కూడా ఏర్పాటు చేసింది.
వివరాలు
బస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు
త్వరలో కొత్త టైమ్‌టేబుల్ బోర్డులను అందుబాటులోకి తీసుకురానుంది.
ప్రయాణికుల భద్రతను పెంచడంతో పాటు బస్ స్టేషన్లలో రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
త్వరలో రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది.
వీటిని సంబంధిత ప్రాంతీయ కార్యాలయాలతో పాటు ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి అనుసంధానించనున్నారు.
దీంతో బస్ స్టేషన్లలో జరుగుతున్న పరిణామాలు, రద్దీ పరిస్థితులను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలవుతుంది.
బస్ స్టేషన్లలో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు.
ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు సంస్థ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.