Page Loader
Punjab: పంజాబ్ బడుల్లో తెలుగు పాఠాలు..! విద్యార్థులకు భాషాపై విశేష శిక్షణ
పంజాబ్ బడుల్లో తెలుగు పాఠాలు..! విద్యార్థులకు భాషాపై విశేష శిక్షణ

Punjab: పంజాబ్ బడుల్లో తెలుగు పాఠాలు..! విద్యార్థులకు భాషాపై విశేష శిక్షణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 03, 2025
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాషకు ప్రత్యేక స్థానం లభించింది. కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న 'భారతీయ భాషల వేసవి శిబిరాలు' కార్యక్రమంలో భాగంగా, పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాషను బోధించారు.

Details

వారం రోజుల తెలుగు శిక్షణ

మే 26 నుంచి ప్రారంభమైన ఈ ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఒక వారం పాటు సాగాయి. ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు వీటిలో పాల్గొన్నారు. ఈ శిబిరాల్లో తెలుగు భాష పాఠాలు నేర్పించిన ఉపాధ్యాయులు, విద్యార్థులకు ముందుగా తెలుగు వర్ణమాలపై అవగాహన కల్పించారు. పండ్లు, కూరగాయలు, వంటకాలు, సంగీత పరికరాల పేర్లను తెలుగులో చదివించి, రాయించేలా ప్రాక్టీస్‌ చేయించారు. అంతేకాదు, 'నమస్కారం', 'ధన్యవాదాలు', 'అభినందనలు' వంటి గౌరవపూర్వక పదాలను వివరించడమే కాకుండా, దేశభక్తి గీతాలు పాడిస్తూ, వాటి అర్థాన్ని కూడా వివరించారు. తెలుగు రాష్ట్రాలకు వెళితే ప్రజలతో ఎలా సంభాషించాలో ఆటో డ్రైవర్లు, బస్సు కండక్టర్లు, వ్యాపారులను ఎలా సంబోధించాలో విద్యార్థులకు వివరించారు.

Details

ప్రత్యేక మెటీరియల్‌తో విద్యనందింపు

ఈ శిక్షణ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఏక్ భారత్‌ శ్రేష్ఠ్ భారత్‌' ప్రాజెక్టులో భాగంగా జరిగింది. తెలుగు నోడల్‌ అధికారి ఆధ్వర్యంలో, పంజాబ్‌ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అమలైంది. విద్యార్థులకు బోధించాల్సిన తెలుగు ప్రాథమిక అంశాలకు సంబంధించిన డిజిటల్‌ మెటీరియల్ (యూట్యూబ్‌ వీడియోలు), ప్రింటెడ్‌ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. విద్యార్థులు తమ ఇంట్లోనే ఆ మెటీరియల్‌ను అధ్యయనం చేసి లెర్నింగ్‌ షీట్లు తయారుచేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా అమలైనా.. పంజాబ్‌లోని కొందరు ఉపాధ్యాయ సంఘాలు మాత్రం కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. అయినా విద్యార్థుల స్పందన మాత్రం అనూహ్యంగా సానుకూలంగా ఉండడం విశేషం.