Loading...
Rahul Gandhi: రాహుల్ గాంధీ పర్యటన వేళ టెన్షన్.. పూణెలో 50 మంది అరెస్ట్
రాహుల్ గాంధీ పర్యటన వేళ టెన్షన్.. పూణెలో 50 మంది అరెస్ట్

Rahul Gandhi: రాహుల్ గాంధీ పర్యటన వేళ టెన్షన్.. పూణెలో 50 మంది అరెస్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 22, 2026
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పూణె పర్యటనకు ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం సాయంత్రం పూణెలో విద్యార్థులతో 'ఛాత్రోన్ కీ గూంజ్' కార్యక్రమంలో రాహుల్‌ పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, పూణె (COEP) హాస్టల్‌ క్యాంపస్‌లో ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ సభ్యుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. 50 మందికి పైగా యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు.

వివరాలు

అసలు వివాదం ఏంటి?

రాహుల్‌గాంధీ నిర్వహించనున్న 'ఛాత్రోన్ కీ గూంజ్' కార్యక్రమానికి విద్యార్థులను ఆహ్వానించేందుకు ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు పలు కళాశాలల క్యాంపస్‌లను సందర్శించినట్లు సమాచారం.

అయితే ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్న ఇద్దరు విద్యార్థినులను ఏబీవీపీ సభ్యులు బెదిరించి హాస్టల్‌లో నిర్బంధించారని ఎన్‌ఎస్‌యూఐ ఆరోపించింది.

విద్యార్థినులను బయటకు తీసుకొచ్చేందుకు తాము క్యాంపస్‌లోకి వెళ్లామని ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు తమపై లాఠీచార్జ్‌ చేశారని ఆరోపించారు.

మరోవైపు.. ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు హాస్టల్‌ విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి రాహుల్‌గాంధీ కార్యక్రమానికి హాజరయ్యేలా చేస్తున్నారని ఏబీవీపీ సభ్యులు ఆరోపించారు.

ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనలో పలువురు కార్యకర్తలు గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు.

వివరాలు

కాంగ్రెస్‌ నేతల ధర్నా

ఘర్షణ విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత విజయ్‌ వాడెట్టివార్‌ సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు అర్ధరాత్రి సీవోఈపీ క్యాంపస్‌కు చేరుకున్నారు.

పోలీసుల చర్యను నిరసిస్తూ ధర్నాకు దిగారు. పోలీసుల లాఠీచార్జ్‌ను కాంగ్రెస్‌ నేత బాలాసాహెబ్‌ థోరాట్‌ తీవ్రంగా ఖండించారు.

విద్యార్థుల గొంతును అణచివేసేందుకు బలప్రయోగం చేసినా ఫలితం ఉండదని వ్యాఖ్యానించారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి గాయపడిన పార్టీ కార్యకర్తలను పరామర్శించారు.

కాంగ్రెస్‌ నేత నానా పటోలే ఈ ఘటనను ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘర్షణగా అభివర్ణించారు. రాహుల్‌గాంధీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకే ఏబీవీపీ సభ్యులు ఈ వివాదాన్ని సృష్టించారని ఆరోపించారు.

ADVERTISEMENT

వివరాలు

'ఛాత్రోన్ కీ గూంజ్' కాదు.. 'పైసే కీ గూంజ్': బీజేపీ

మరోవైపు రాహుల్‌గాంధీ పూణె కార్యక్రమంపై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. 'ఛాత్రోన్ కీ గూంజ్' కార్యక్రమాన్ని 'పైసే కీ గూంజ్'గా అభివర్ణించింది.

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు డబ్బులు చెల్లించి కాంగ్రెస్‌ కార్యక్రమానికి జనాలను సమీకరిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి నవనాథ్‌ బన్‌ ఆరోపించారు.

కాంగ్రెస్‌ దాదాపు రూ.10 కోట్లు ఖర్చు చేసిందని, ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు చెల్లించిందని ఆయన పేర్కొన్నారు.

సుమారు 3,000 మందికి చెల్లింపులు చేస్తే రూ.9 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఖర్చవుతుందని అన్నారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని, ఎవరి ద్వారా పంపిణీ చేస్తున్నారని ప్రశ్నించారు.

ADVERTISEMENT

వివరాలు

బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్‌ స్పందన

బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. యువతలో రాహుల్‌గాంధీకి పెరుగుతున్న ఆదరణను చూసి బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్‌ నేత సచిన్‌ సావంత్‌ విమర్శించారు.

రాహుల్‌గాంధీ పర్యటనకు ముందు చోటుచేసుకున్న ఈ ఘర్షణతో పూణెలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

ADVERTISEMENT