Loading...
Jammu and Kashmir: భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర.. భగ్నం చేసిన జవాన్
భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర.. భగ్నం చేసిన జవాన్

Jammu and Kashmir: భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర.. భగ్నం చేసిన జవాన్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2026
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. అయితే ఓ జవాన్‌ చూపిన సమయస్ఫూర్తి, ధైర్యంతో ఉగ్రవాదుల ప్రయత్నం విఫలమైంది. దాడిలో గాయపడినప్పటికీ ఆ జవాన్‌ వెనక్కి తగ్గకుండా ఎదురుకాల్పులు జరపడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది గాయపడ్డారు. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. అందులో ఉగ్రవాదులు పెద్ద ఎత్తున కాల్పులు జరుపుతున్న దృశ్యాలు నమోదయ్యాయి.

వివరాలు 

ముందుగానే హెచ్చరికలు..

కుల్గాం ప్రాంతంలో అనుమానిత ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాలు ముందుగానే భద్రతా బలగాలను హెచ్చరించాయి.

దీంతో సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. కనీసం ఇద్దరు ఉగ్రవాదులు గేబియన్‌ నిర్మాణం వెనుక మాటువేసి సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపై కాల్పులు జరిపారు.

ఈ క్రమంలో ఓ జవాన్‌కు గాయాలయ్యాయి. అయినప్పటికీ ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వెంటనే ఎదురుకాల్పులు ప్రారంభించారు.

దీంతో ఉగ్రవాదుల దాడి వ్యూహం ఫలించలేదు. భద్రతా బలగాలు మరింత తీవ్రంగా స్పందించేలోపే దుండగులు అక్కడి నుంచి వెనుదిరిగి పారిపోయారు.

వివరాలు 

భారీ ప్రాణనష్టమే లక్ష్యంగా..

దాడి జరిగిన ప్రాంతానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే సీఆర్‌పీఎఫ్‌ క్యాంపు ఉంది.

ఉగ్రవాదులు ముందస్తు ప్రణాళికతో అక్కడికి చేరుకుని భద్రతా సిబ్బందికి భారీగా ప్రాణనష్టం కలిగించాలనే ఉద్దేశంతో దాడికి పాల్పడినట్లు అధికారులు విశ్లేషించారు.

అయితే భద్రతా బలగాల అప్రమత్తత, ముందస్తు సన్నద్ధత కారణంగా ఉగ్రవాదుల వ్యూహం బెడిసికొట్టిందని ఓ అధికారి వెల్లడించారు.

పహల్గాం దాడి తర్వాత కీలక ఘటన..

కశ్మీర్‌ లోయలో కొంతకాలంగా ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తాజా కుల్గాం దాడి ప్రాధాన్యం సంతరించుకుంది.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత లోయలో చోటుచేసుకున్న అతిపెద్ద ఉగ్రవాద ఘటనగా దీన్ని పరిగణిస్తున్నారు.

పహల్గాంలో జరిగిన దాడి భారత్‌-పాక్‌ మధ్య నాలుగు రోజుల పాటు సైనిక ఘర్షణకు దారితీసిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT

వివరాలు 

స్థానిక ఉగ్రవాదుల కదలికలపై నిఘా..

కశ్మీర్‌లో స్థానిక యువత ఉగ్రవాద సంస్థల్లో చేరడం దాదాపుగా నిలిచిపోవడం అక్కడి భద్రతా పరిస్థితుల్లో మార్పునకు కారణమైందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

గత వారం కశ్మీర్‌ జోన్‌ ఐజీపీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం లోయలో లతీఫ్‌ అహ్మద్‌ భట్‌ అనే ఒక్క స్థానిక ఉగ్రవాది మాత్రమే క్రియాశీలంగా ఉన్నట్లు వెల్లడించారు.

అయితే తాజా కుల్గాం దాడిలో అతడి ప్రమేయం ఉందా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆగస్టు 1న ఇదే ప్రాంతంలో వలస కార్మికులపై జరిగిన దాడిలోనూ అతడి పేరు తెరపైకి వచ్చింది.

ADVERTISEMENT