Loading...
Damodara Rajanarasimha: ఇక జిల్లాల్లోనే అన్ని రకాల వైద్య సేవలు.. 1,616 మంది వైద్యుల నియామకం
ఇక జిల్లాల్లోనే అన్ని రకాల వైద్య సేవలు.. 1,616 మంది వైద్యుల నియామకం

Damodara Rajanarasimha: ఇక జిల్లాల్లోనే అన్ని రకాల వైద్య సేవలు.. 1,616 మంది వైద్యుల నియామకం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 09, 2026
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు కూడా హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లాల్లోనే అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. అవసరమైన నర్సులు, టెక్నీషియన్ల నియామకాలు కూడా చేపట్టినట్లు తెలిపారు. సచివాలయంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ పునర్వ్యవస్థీకరణపై మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి జిల్లాలో డీసీహెచ్ఎస్ కార్యాలయాల ఏర్పాటుపైనా అధికారులతో చర్చించారు.

వివరాలు 

ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను బట్టి వైద్య సేవల ప్రణాళికలు

ఈ సందర్భంగా సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడానికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు.

ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను బట్టి వైద్య సేవల ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు.

ముఖ్యంగా 30, 50, 100 పడకల ఆసుపత్రులకు వేర్వేరుగా సేవల ప్రణాళికలను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

ప్రతి ఆసుపత్రిలో స్పెషలిస్ట్ వైద్యుల సేవలతో పాటు ఆధునిక వైద్య పరికరాలు, అవసరమైన డయాగ్నస్టిక్ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

వివరాలు 

ఐపీహెచ్ఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ఆసుపత్రులను అభివృద్ధి చేయాలి:  మంత్రి

ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (ఐపీహెచ్ఎస్) ప్రమాణాలకు అనుగుణంగా ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు.

ఆసుపత్రుల పనితీరు, రోగులకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు.

జిల్లా స్థాయిలోనే మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌పై రోగుల ఆధారపడటం తగ్గుతుందని మంత్రి పేర్కొన్నారు.

ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలను వారి జిల్లాల్లోనే అందించేందుకు వైద్య సదుపాయాలను విస్తరించాలని స్పష్టం చేశారు.

ADVERTISEMENT