TG: ప్రభుత్వ పాఠశాలలకు తగ్గుతున్న ఆదరణ?.. 21.39 లక్షల ప్రవేశాలే లక్ష్యం..
ఈ వార్తాకథనం ఏంటి
2026-27 విద్యా సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదును 21.39 లక్షలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఆ లక్ష్యాన్ని సాధించడం కష్టసాధ్యంగా కనిపిస్తోంది. పాఠశాలలు ప్రారంభమై ఇప్పటికే 15 రోజులు పూర్తయినా, ఇప్పటివరకు నమోదైన విద్యార్థుల సంఖ్య కేవలం 17.73 లక్షలకే పరిమితమైంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో సాధారణ ప్రభుత్వ పాఠశాలలతో పాటు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు), జనరల్ గురుకులాలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు కూడా ఉన్నాయి.
వివరాలు
విద్యాశాఖకు సవాల్..
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 వేల విద్యాసంస్థల్లో గత విద్యా సంవత్సరం (2025-26) ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తం 19.25 లక్షల మంది విద్యార్థులు చదువుకున్నారు. ఈసారి ఆ సంఖ్యను కనీసం 10 శాతం పెంచి 21.39 లక్షలకు చేర్చాలనే లక్ష్యాన్ని శాఖ నిర్దేశించింది. జూన్ 30 నాటికి రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తం 17,73,643 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందినట్లు పాఠశాల విద్యాశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంకా 3,65,364 మంది విద్యార్థులు అదనంగా చేరాల్సి ఉంది. గత ఏడాది నమోదైన విద్యార్థుల సంఖ్యను చేరుకోవడమే ప్రస్తుతం విద్యాశాఖకు ప్రధాన సవాల్‌గా మారిందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
వివరాలు
ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల విశ్వాసం తగ్గిందా?
ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) అందించే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ప్రస్తుతం ఈ సౌకర్యం కేవలం 1.44 లక్షల మంది విద్యార్థులకే పరిమితమైంది. అదేవిధంగా విద్యార్థులకు బూట్లు, బెల్ట్‌లు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు వాటి పంపిణీ ప్రారంభం కాలేదు. ఏకరూప దుస్తుల సరఫరా కూడా మరో నెల రోజుల తర్వాతే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సంక్షేమ పథకాల కంటే నాణ్యమైన విద్యకు తల్లిదండ్రులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు పరిస్థితులు సూచిస్తున్నాయి. ఈ ఏడాది ఉపాధ్యాయులు విస్తృత స్థాయిలో 'బడిబాట' కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల చేరికల కోసం ప్రత్యేకంగా కృషి చేసినప్పటికీ, ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో ఆశించిన స్థాయిలో విశ్వాసం పెరగలేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.