Loading...
TGSRTC: టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. నాన్‌స్టాప్ బస్సుల్లో ఇక సెల్ఫ్ టికెటింగ్
టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. నాన్‌స్టాప్ బస్సుల్లో ఇక సెల్ఫ్ టికెటింగ్

TGSRTC: టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. నాన్‌స్టాప్ బస్సుల్లో ఇక సెల్ఫ్ టికెటింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2026
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరో కొత్త విధానాన్ని తీసుకురానుంది. నాన్‌స్టాప్ బస్సు సర్వీసుల్లో ఇకపై 'సెల్ఫ్ టికెటింగ్' సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. దీని ద్వారా బస్సు ఎక్కే ముందు టికెట్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రయాణికులే స్వయంగా టికెట్ తీసుకునే అవకాశం ఉంటుంది.

వివరాలు 

ఎలా తీసుకోవాలంటే..

సెల్ఫ్ టికెటింగ్ విధానాన్ని వినియోగించాలనుకునే ప్రయాణికులు బస్సు ఎక్కే ముందు డోర్ వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేయాలి.

ఆ తర్వాత తాము ప్రయాణం ప్రారంభించే స్టాప్, దిగాల్సిన స్టాప్ వివరాలను నమోదు చేయాలి.

ఆన్‌లైన్‌లో చెల్లింపు పూర్తి చేసిన వెంటనే డిజిటల్ టికెట్ జనరేట్ అవుతుంది. ఆ టికెట్‌ను డ్రైవర్‌కు చూపిస్తే ప్రయాణం చేయవచ్చు.

తొలుత నల్గొండ-హైదరాబాద్ రూట్‌లో..

ఈ స్మార్ట్ టికెటింగ్ విధానాన్ని మొదట ప్రయోగాత్మకంగా నల్గొండ-హైదరాబాద్ మార్గంలో అమలు చేయాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.

ప్రస్తుతం ఈ రూట్‌లో 45 డీలక్స్ నాన్‌స్టాప్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి.

వివరాలు 

ప్రయాణికులకు సమయం ఆదా..

ఈ మార్గంలో సెల్ఫ్ టికెటింగ్ విధానం విజయవంతమైతే.. సెప్టెంబర్ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని మిగిలిన అన్ని నాన్‌స్టాప్ రూట్లకు కూడా ఈ సదుపాయాన్ని విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు.

కొత్త సెల్ఫ్ టికెటింగ్ విధానం వల్ల ప్రయాణికులకు చిల్లర సమస్య తప్పడంతో పాటు టికెట్ కోసం వెచ్చించే సమయం కూడా ఆదా అవుతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు డ్రైవర్లపై ఉన్న టికెట్లు జారీ చేసే పనిభారం కూడా కొంత మేర తగ్గనుంది.

ADVERTISEMENT

వివరాలు 

అందరికీ అవకాశం..

స్మార్ట్‌ఫోన్ లేని వారు లేదా డిజిటల్ చెల్లింపులపై అవగాహన లేని ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.

అలాంటి వారు ఇప్పటిలాగే డ్రైవర్ వద్ద నేరుగా టికెట్ కొనుగోలు చేయవచ్చని తెలిపారు.

ఈ సెల్ఫ్ టికెటింగ్ సేవను అమలు చేసేందుకు 'మీ సేవ'కు చెందిన 'మీ టికెట్' సంస్థతో టీజీఎస్ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది.

దీంతో నాన్‌స్టాప్ బస్సు ప్రయాణికులకు టికెట్ కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది.

ADVERTISEMENT