LOADING...
TGSRTC: నష్టాల నుంచి లాభాల దిశగా టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణం
నష్టాల నుంచి లాభాల దిశగా టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణం

TGSRTC: నష్టాల నుంచి లాభాల దిశగా టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణం

వ్రాసిన వారు Moogati Shabari
Jun 28, 2026
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏళ్ల తరబడి వేల కోట్ల రూపాయల నష్టాలతో సతమతమైన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ఇప్పుడు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించింది. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం వంటి పరిణామాలు సంస్థను నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకొచ్చాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.1,059.27 కోట్ల లాభాన్ని నమోదు చేయగా, ఇది ఆర్టీసీ చరిత్రలోనే అత్యధిక వార్షిక లాభంగా నిలిచింది. ఈ విజయాన్ని కొనసాగిస్తూ 2026-27 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం నుంచి అన్ని వ్యయాలను మినహాయించిన తర్వాత రూ.1,118.86 కోట్ల మిగులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

వివరాలు

దశాబ్దం తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..

ఇందుకోసం రూ.9,639.54 కోట్ల ఆదాయం సమకూరుతుందని, వ్యయాలు రూ.8,520.68 కోట్ల వరకు ఉండొచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన తాజా నివేదికలో పేర్కొంది. 2014-15 నుంచి 2022-23 వరకు టీజీఎస్‌ఆర్టీసీ వరుసగా ఆర్థిక నష్టాలను ఎదుర్కొంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి ప్రభావంతో 2020-21లో సంస్థ ఆదాయం భారీగా పడిపోయి కేవలం రూ.2,455 కోట్లకు మాత్రమే పరిమితమైంది. అదే సమయంలో రూ.2,329 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇది ఆర్టీసీ చరిత్రలో నమోదైన అత్యధిక నష్టం.

వివరాలు

కోట్ల నష్టాలను భరించిన సంస్థ..

అలాగే 2014-15లో రూ.299.64 కోట్లు, 2015-16లో రూ.1,150.48 కోట్లు, 2016-17లో రూ.749.28 కోట్లు, 2017-18లో రూ.748.90 కోట్లు, 2018-19లో రూ.928.67 కోట్ల నష్టాలను సంస్థ భరించింది. అయితే దాదాపు పదేళ్ల తర్వాత 2023-24లో తిరిగి లాభాల దిశగా అడుగుపెట్టింది. 2014-15లో రూ.3,294 కోట్లుగా ఉన్న సంస్థ ఆదాయం, 2025-26 నాటికి రూ.9,374.18 కోట్లకు పెరగడం విశేషం. అంటే పదేళ్ల వ్యవధిలో దాదాపు మూడు రెట్లు ఆదాయం పెరిగింది.

Advertisement