'ఆ దగ్గు సిరప్ తయారీని నిలిపేశాం'.. ఉజ్బెకిస్తాన్‌లో పిల్లల మరణాలపై స్పందించిన కేంద్రం
భారత ఔషధ సంస్థ తయారు చేసిన దగ్గు సిరప్ తాగి తమ దేశంలో 18మంది చనిపోయారని ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ ప్రకటించిన నేపథ్యంలో.. కేంద్రం స్పందించింది. ఈ విషయంలో ఉజ్బెకిస్థాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ఘటనపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ విచారణ జరుపుతున్నట్లు.. ఇప్పటికే దగ్గు సిరప్ తయారీని నిలిపివేసినట్లు తెలిపింది. ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ ఆరోపిస్తున్న డాక్ -1 మాక్స్ దగ్గు సిరప్ నమూనాలను చండీగఢ్‌లోని రీజనల్ డ్రగ్స్ టెస్టింగ్ లాబొరేటరీకి పరీక్షల కోసం పంపినట్లు ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ల్యాబ్ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి తీసుకుంటామని ఆయన ప్రకటించారు.
సిరప్‌లో 'ఇథిలీన్ గ్లైకాల్'..
డాక్ -1 మాక్స్ దగ్గు సిరప్‌ను ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా తమ ల్యాబ్‌లో పరీక్షించింది. సిరప్‌లో ప్రమాదకర ' ఇథిలీన్ గ్లైకాల్' ఉన్నట్లు ఉజ్బెకిస్తాన్ చెబుతోంది. అలాగే వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఫార్మసిస్ట్‌ల సలహా మేరకు పిల్లలకు ఎక్కువ మోతాదులతో సిరప్‌ను పిల్లలకు అందించినట్లు ఉజ్బెకిస్తాన్ వెల్లడించింది. పిల్లలు ఆసుపత్రిలో చేరే ముందు ఈ సిరప్‌ను 2-7 రోజుల పాటు ఇంట్లో 2.5 నుంచి 5 ఎంఎల్ మోతాదులో రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు తీసుకున్నట్లు ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.