CRCS-Sahara Refund Portal: సహారా డిపాజిటర్ల రీఫండ్ కోసం పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్రం
సహారా గ్రూప్‌లోని 10 కోట్ల మంది డిపాజిటర్లు తమ డబ్బును 45 రోజుల్లో తిరిగి క్లెయిమ్ చేసుకునేందుకు 'సీఆర్‌సీఎస్- సహారా రీఫండ్ పోర్టల్'ను కేంద్ర సహకార మంత్రి అమిత్ షా మంగళవారం ప్రారంభించారు. సహారా గ్రూప్‌లోని నాలుగు సహకార సంఘాల్లో చిక్కుకున్న డిపాజిటర్ల డబ్బును తిరిగి ఇచ్చే ప్రక్రియ సహారా రీఫండ్ పోర్టల్‌ను ప్రారంభించడాన్ని ఒక చారిత్రక సందర్భంగా షా పేర్కొన్నారు. 4సహకార సంఘాలకు చెందిన 10 కోట్ల మంది డిపాజిటర్లకు తొమ్మిది నెలల్లోనే వారి డబ్బు తిరిగి వస్తుందని మార్చి 29న కేంద్రం హామీ ఇచ్చింది. ఆ తర్వాత సహారా-సెబీ రీఫండ్ ఖాతా నుంచి సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్(సీఆర్‌సీఎస్)కి రూ.5,000 కోట్లను బదిలీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
తొలి దశలో రూ. 10,000 వరకు డిపాజిట్ చేసిన వారికి రీఫండ్
సహార డిపాజిటర్లు తమ డబ్బును తిరిగి పొందేందుకు mocrefund.crcs.gov.in వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు. సహారా గ్రూపులో సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, సహారాయన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్, హుమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అనే నాలుగు సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో సుమారు 2.5 కోట్ల మంది రూ. 30,000 చొప్పున డిపాజిట్ చేశారు. మొదటి దశలో 5,000 కోట్ల రూపాయల కార్పస్‌తో రూ. 10,000 వరకు డిపాజిట్ చేసిన వారికి తిరిగి చెల్లిస్తామని అమిత్ షా చెప్పారు. వీరు 1.7 కోట్ల మంది ఉంటారని వెల్లడించారు. మిగిలిన వారికి తర్వాత చెల్లిస్తామని అమిత్ షా పేర్కొన్నారు.