Kangana Ranaut: కంగనాపై కాంగ్రెస్ మహిళా నేత అసభ్యకరమైన పోస్ట్.. మండిపడుతున్న బీజేపీ
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి, నటి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనెత్ చేసిన పోస్టు తీవ్ర దుమారం రేపుతోంది. ఆమె పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) సోమవారం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. లోక్‌సభ ఎన్నికల వేళ శ్రీనెత్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి రనౌత్ గురించి అభ్యంతరకరమైన పోస్ట్ ఒకటి నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. శ్రీనెత్, అహిర్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ ఎన్నికల సంఘానికి లేఖ రాశారని ఎన్‌సీడబ్ల్యూ తెలిపింది. సుప్రియ శ్రీనెత్ అవమానకర ప్రవర్తనతో జాతీయ మహిళా కమిషన్ దిగ్భ్రాంతి చెందిందని తన పోస్ట్‌లో పేర్కొంది.
ప్రతి స్త్రీ గౌరవానికి అర్హమైనది
క్వీన్‌లో అమాయక పాత్ర నుంచి తలైవిలో శక్తిమంతమైన మహిళా నేత వరకు.. మణికర్ణికలో దేవత పాత్ర నుంచి చంద్రముఖిలో దెయ్యం పాత్ర వరకు.. 20 ఏళ్ల తన సినీ కెరీర్‌లో ఇలా అనేక రకాల పాత్రల్లో నటించానని కంగనా అన్నారు. మహిళలను దురాభిమానపు సంకెళ్ల నుంచి కాపాడుకోవాలని.. సెక్స్ వర్కర్ల దుర్భర జీవితాలను ప్రస్తావిస్తూ ఇతరులను దూషించడం మానుకోవాలని.. ప్రతి మహిళ తన గౌరవానికి అర్హురాలు అని కంగనా రనౌత్ పేర్కొన్నారు.
సుప్రియ శ్రీనెత్ క్లారిటీ
మొత్తం ఎపిసోడ్‌పై క్లారిటీ ఇస్తూ, శ్రీనెత్ తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల యాక్సెస్ చాలామంది దగ్గర ఉందని, వారిలో ఒకరు ఈ అభ్యంతరకర పోస్ట్ పెట్టి ఉంటారని సుప్రియ అన్నారు. తనకు తెలిసిన వెంటనే ఆ పోస్ట్‌ను తొలగించానని చెప్పారు. అయినా ఒక మహిళ గురించి ఎప్పుడూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయనని తెలిపారు. ఆ విషయం తనతో పరిచయం ఉన్న వారందరికీ తెలుసు అని వివరించారు.