మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు
ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు జిల్లా కోర్టు షాకిచ్చింది. మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని సత్తెనపల్లి పోలీసులను ఆదేశించింది. సంక్రాంతి డ్రా పేరుతో వైసీపీ నాయకులు వసూళ్లకు పాల్పడినట్లు జనసేన నాయకులు ఆరోపించారు. అయితే ఈ వసూళ్ల పర్వం వైసీపీ నేత, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో జరిగినట్లు జనసేన నాయకులు కోర్టును ఆశ్రయించారు. దీంతో పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన గుంటూరు జిల్లా కోర్టు మంత్రిపై తక్షణమే కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు: జనసేన
'సంక్రాంతి డ్రా' వసూళ్ల అంశంపై తొలుత జనసేన నాయకులు సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేసినట్లు.. అందుకే తాము కోర్టును ఆశ్రయించినట్లు జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు చెప్పారు. ఇటీవల సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబును టార్గెట్ చేసి జనసేన నాయకులు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. సాయం కోసం వచ్చిన ఒక కుటుంబాన్ని అంబటి రాంబాబు లంచం అడిగారని జనసేన నాయకులు ఆరోపించడం సంచలనంగా మారింది. దీనిపై మంత్రి స్పందించి వివరణ కూడా ఇచ్చారు. ఆ వివాదం సద్దమణగముందే.. ఇప్పుడు 'సంక్రాంతి డ్రా' అంశం తెరపైకి వచ్చింది.