దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వాదించేందుకు లాయర్లకు ఆప్ ప్రభుత్వం రూ.కోట్ల ఫీజు చెల్లింపు
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ కేసులో సంబంధించి కోర్టులో హాజరవుతున్న న్యాయవాదులకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.25.25 కోట్లు చెల్లించినట్లు అధికార వర్గాలు తెలిపారు. రాజ్ భవన్ వర్గాల సమాచారం ప్రకారం.. సీనియర్ న్యాయవాది డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ రూ. 25.25 కోట్లలో రూ. 18.97 కోట్లు అందుకున్నారు. మరో న్యాయవాది రాహుల్ మెహ్రా జైలులో ఉన్న మంత్రి సత్యేందర్ జైన్ కేసులలో తరచుగా హాజరవుతూ ఈ కాలంలో రూ. 5.30 కోట్లు పొందారు.
సంఘ్వీకే అధిక మొత్తం
2021-22లో సింఘ్వీ తొలుత రూ. 14.85 కోట్లు, తర్వాత మరో రూ. 4.1 కోట్లు అందుకున్నారు. 2020-21లో మెహ్రా రూ. 2.4 లక్షలు, 2021-22లో రూ. 3.9 కోట్లు తీసుకున్నారు. 2021-22లో మద్యం కుంభకోణం కేసులో వాదిస్తున్న న్యాయవాదులకు రూ.16.09 కోట్లను ప్రభుత్వం ముట్టజెప్పింది. 2022-23 ఎనిమిది నెలల్లో రూ. 5.24 కోట్లను చెల్లించినట్లు అధికార వర్గాలు వెల్లడించారు. మద్యం కుంభకోణం వెలుగులోకి రాకముందు.. దిల్లీ ఆప్ ప్రభుత్వం లాయర్ల కోసం చేసిన ఖర్చు కేవలం రూ. 6.70 కోట్లు మాత్రమేనని, ఇందులో అధిక మొత్తం సాధారణ పరిపాలన విభాగం, ఆరోగ్య శాఖకు చెందినవని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.