షాకింగ్ న్యూస్: దేశంలో 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు గుర్తింపు
చైనాలో ఒమిక్రాన్ బీఎఫ్-7 సబ్ వేరియంట్ విజృంభణ నేపథ్యంలో దేశంలో కూడా దీనిపైనే చర్చ జరిగింది. అయితే తాజాగా తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే.. దేశంలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఉన్నాయని తేలింది. ఈ విషయంగా అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లను కనుగొన్నిది అంతర్జాతీయ ప్రయాణికుల్లోనే కావడం గమనార్హం. డిసెంబర్ 24 నుంచి జనవరి 3 మధ్య భారతదేశంలోని విమానాశ్రయాలు, ఓడరేవుల్లోని అంతర్జాతీయ ప్రయాణీకుల్లో 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లను గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. అయితే ఇప్పుడు గుర్తించినట్లు ఈ వేరియంట్లు అన్ని.. గతంలోనే దేశంలో కనుగొన్నట్లు చెప్పింది.
124 మందికి పాజిటివ్
దేశంలో ఇప్పటి వరకు 19,227 అంతర్జాతీయ ప్రయాణీకుల నమూనాలను పరీక్షించగా.. అందులో 124 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో వారిని క్వారంటైన్‌కు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. పాజిటివ్‌గా తేలిన 124 మందిలో.. 40 నమూనాలకు సంబంధించిన జన్యు శ్రేణి ఫలితాలు వచ్చాయి. వీటిలో ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీబీ.1, బీఎఫ్7.4.1 సహా.. మొత్తం 14 వేరియంట్లను గుర్తించినట్లు కేంద్రం చెప్పింది. అందులో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు 11 ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. గత 24గంటల్లో 188 కొత్త కరోనా కేసులను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ చెప్పింది. బుధావారంతో పోలిస్తే.. గురువారం కేసులు స్వల్పంగా పెరిగినట్లు పేర్కొంది.