Page Loader
తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురు.. క్యాడర్ కేటాయింపు రద్దు
తెలంగాణ సీఎస్‌గా సోమేష్‌కుమార్‌ కొనసాగింపును రద్దు చేసిన హైకోర్టు

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురు.. క్యాడర్ కేటాయింపు రద్దు

వ్రాసిన వారు Stalin
Jan 10, 2023
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ సీఎస్‌గా పని చేస్తున్న సోమేష్ కుమార్‌ క్యాడర్ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. సోమేష్‌కుమార్‌ కేడర్‌ను రద్దు చేసింది. ఏపీ క్యాడర్‌కు సోమేష్‌కుమార్‌ వెళ్లాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ‌ సందర్భంగా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సోమేష్ కుమార్‌‌ను కేంద్రం ఏపీకి కేటాయించింది. అయితే కేంద్రం కేటాయింపును నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా.. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ( క్యాట్) ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని.. కేంద్ర ప్రభుత్వం 2017లో హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం.. మంగళవారం తుది తీర్పును వెలువరించింది.

సోమేష్ కుమార్

సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం

సోమేష్ కుమార్‌ ఏపీ క్యాడర్‌కు వెళ్లేందుకు ఆయనకు కనీసం మూడు వారాల సమయం కావాలని ఆయన తరఫున వాదించే లాయర్ హైకోర్టును కోరారు. అయితే ధర్మాసనం దీనికి ఒప్పుకోలేదు. తీర్పు వచ్చిన వెంటనే సోమేష్ కుమార్‌ ఏపీకి వెళ్లిపోవల్సి ఉంటుందని ధర్మాసనం స్పషంగా పేర్కొంది. సోమేష్ కుమార్ తెలంగాణలో పని చేయడానికే సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ క్యాడర్‌కు వెళ్లడానికి ఆయన సిద్ధంగా లేనట్లు సమాచారం. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. సోమేష్ కుమార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.