Page Loader
Dress code: పూరీ జగన్నాథ ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్.. జీన్స్, స్కర్టులు ధరిస్తే నో ఎంట్రీ 
పూరీ జగన్నాథ ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్.. జీన్స్, స్కర్టులు ధరిస్తే నో ఎంట్రీ

Dress code: పూరీ జగన్నాథ ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్.. జీన్స్, స్కర్టులు ధరిస్తే నో ఎంట్రీ 

వ్రాసిన వారు Stalin
Oct 10, 2023
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆలయ గౌరవాన్ని, పవిత్రతను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ 'నీతి' సబ్‌కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశా పూరీలోని జగన్నాథుడి ఆలయం 12వ శతాబ్దానికి చెందినది. ఎంతో ప్రవిత్రమైనది. ఈ ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 1 నుంచి భక్తులకు డ్రెస్‌ కోడ్‌ను అమలు చేయనున్నట్లు ఆలయ అధికారి తెలిపారు. ఆలయంలో కొంతమంది అసభ్యకరమైన దుస్తులతో కనిపించడంతో 'నీతి' సబ్‌కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దురదృష్టవశాత్తూ కొందరు మతపరమైన మనోభావాలను పట్టించుకోకుండా ఆలయాన్ని సందర్శిస్తున్నారని శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ రంజన్ కుమార్ దాస్ అన్నారు.

కోడ్

పార్కులో విహరిస్తున్నట్లు గుడిలో కనిపిస్తున్నారు: ఆలయ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ 

కొంతమంది చిరిగిన జీన్స్, స్లీవ్‌లెస్ డ్రెస్‌లు, హాఫ్ ప్యాంట్‌లు ధరించి, సముద్ర తీరంలోనో, పార్కులోనో విహరిస్తున్నట్లు గుడిలో కనిపించారని రంజన్ కుమార్ దాస్ అన్నారు. ఇది దేవుడి నివాసం అని, వినోద ప్రదేశం కాదని పేర్కొన్నారు. అయితే ఆలయంలోకి ఎలాంటి డ్రెస్‌లను అనుమతించాలో త్వరలో నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. జనవరి 1, 2024 నుంచి ఆలయం లోపల డ్రెస్ కోడ్ కచ్చితంగా అమలు చేయబడుతుందని చెప్పారు. డ్రెస్ కోడ్ అమలు బాధ్యతను 'సింగ ద్వార్' వద్ద మోహరించిన భద్రతా సిబ్బందికి అప్పగించినట్లు వివరించారు. అయితే భక్తులకు డ్రెస్‌ కోడ్‌పై మంగళవారం నుంచి అవగాహన కల్పించేందుకు ఆలయ నిర్వాహకులు శ్రీకారం చుట్టారు.