
అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
అమరావతి కేసును వెంటనే విచారించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు మరోసారి తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను జులై 11న విచారించనున్నట్లు జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నతో కూడి న ధర్మాసనం పేర్కొంది.
అమరావతి రాజధాని పిటిషన్‌ను త్వరగా విచారించాలని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది ధర్మాసనాన్ని కోరగా, విచారణను జులై 11న చేపడుతామని న్యాయమూర్తులు వెల్లడించారు.
అమరావతిని రాజధాని నగరంగా కొనసాగించడాన్ని సమర్థిస్తూ రైతులతోపాటు, ఇతర వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లు, అమరావతికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లన్నీ కలిపి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్, అమరావతి రైతుల తరఫున శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు.
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన జగన్ సర్కార్
అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ గత ఏడాది మార్చి 3న రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది.
అమరావతిలో పెండింగ్‌లో ఉన్న పనులను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లోని కొన్ని అంశాలపై గతంలో సుప్రీంకోర్టు స్టే విధించింది.
వాస్తవానికి అమరావతి అంశం జనవరి 31న విచారణకు రావలసి ఉంది. సుప్రీంకోర్టు దానిని మార్చి 28కి వాయిదా వేసింది.