సినిమా హాళ్లలోకి బయటి తినుబండారాలను అనుమతించడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సినిమా హాళ్ల లోపల ఆహారం, పానీయాల అమ్మకానికి సంబంధించిన నిబంధనలు, షరతులను విధించే పూర్తి అర్హత యజమానులకు ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమా హాళ్లలోకి బయట నుంచి తినుబండారాలను తీసుకెళ్తే.. వాటికి నియంత్రించే అధికారం యజమానులకు ఉంటుందని అత్యున్నత న్యాయ స్థానం చెప్పింది. పిల్లలకు తల్లిదండ్రులు తీసుకువెళ్లే ఆహారానికి సినిమా థియేటర్ల యాజమాన్యాలు అభ్యంతరం చెప్పకూడదని ధర్మాసనం పునరుద్ఘాటించింది. ప్రతి ఒక్కరికీ పరిశుభ్రమైన తాగునీరు థియేటర్లలో ఉచితంగా అందుబాటులో ఉంటుందని, శిశువులకు ఆహారం కూడా అనుమతించబడుతుందని చెప్పారు సీజేఐ. అయితే ప్రతి ఆహారాన్ని ప్రాంగణంలోకి అనుమతించబడదని స్పష్టం చేశారు.
జమ్ముకశ్మీర్ హైకోర్టు తీర్పు కొట్టివేత..
జమ్ముకశ్మీర్ హైకోర్టు 2018లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. థియేటర్ యజమానులు, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లు సినిమా ప్రేక్షకులు తమ సొంత ఆహార పానీయాలను సినిమా హాళ్లలోకి తీసుకెళ్లడాన్ని నిరోధించరాదని జమ్ముకశ్మీర్ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఇప్పుడు హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన అత్యున్నత ధర్మాసనం.. థియేటర్ యజమానులకు అనుకూలంగా తీర్పు చెప్పింది. తీర్పు చెప్పే విషయంలో జమ్ముకశ్మీర్ హైకోర్టు తన పరిధిని అధిగమించినట్లు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పింది.