Supreme Court: ఎంపీలు, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో మినహాయింపు ఉండదు: సుప్రీంకోర్టు
ఎంపీలు, ఎమ్మెల్యేల లంచాల కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఎంపీలు, ఎమ్మెల్యేల లంచం తీసుకుని, పార్లమెంటు, అసెంబ్లీలో ప్రకటనలు చేసినా.. ఓటింగ్ చేసినా క్రిమినల్ చర్యల నుంచి ఎలాంటి మినహాయింపు ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు 1998 నాటి పాత నిర్ణయాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సోమవారం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. రాజ్యాంగ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారు.
పీవీ నరసింహారావు కేసులో ఇచ్చిన తీర్పును తోసిపుచ్చిన సుప్రీం
ఈ కేసుకు తొలుత ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ క్రమంలో ఈ కేసులో అంశాలను విస్తృత ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, ఐదుగురు సభ్యుల ధర్మాసనం దానిని ఏడుగురు సభ్యుల బెంచ్ పరిశీలనకు అప్పగించింది. 1993లో పీవీ నరసింహారావు ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు ఎంపీలకు డబ్బులు ఆశాచూపారని ఆరోపణ. ఈ అంశంపై అప్పట్లో సుప్రీంకోర్టు సుదీర్ఘంగా విచారించింది. 1998లో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆర్టికల్ 105 (2) మరియు 194 (2) ప్రకారం.. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల సభ్యులు తమ విధులను స్వేచ్ఛా వాతావరణంలో నిర్వహించేందుకు లంచాల కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు ధర్మాసనం అప్పట్లో మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని తోసిపుచ్చింది.