'సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదు', కేంద్రంపై దిగ్విజయ సింగ్ విసుర్లు
భారత్ జోడో యాత్రలో భాగంగా జమ్మూలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2016లో జరిగిన సర్జికల్ దాడుల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్ చేసిందని చెబుతున్నా, దానికి ఎలాంటి రుజువు లేదని దిగ్విజయ్ సింగ్ అన్నారు. అబద్ధాల సహాయంతో కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. 2016లో జరిపిన సర్జికల్ దాడులకు సంబంధించి కేంద్రం ఎలాంటి ఆధారాలను పార్లమెంట్‌లో సమర్పించలేదన్నారు. ఈ దేశం అందరిదని, దేశ ప్రజలందరూ ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ఆ రోజు స్కార్పియోను ఎందుకు తనిఖీ చేయలేదు: దిగ్విజయ్
పుల్వామా ఉగ్రదాడి విషయంలో కూడా మోదీ ప్రభుత్వం తీరుపై దిగ్విజయ్ విరుచుకుపడ్డారు. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై దాడి జరిగిన తర్వాత సైనికులకు ఎయిర్ లిఫింగ్ ద్వారా తరలించాలని ఉన్నతాధికారులు కోరినా, మోదీ అందుకు ఒప్పుకోలేదని చెప్పారు. మోదీ ఎందుకు వారి అభ్యర్థనను తిరస్కరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పుల్వామాలో ప్రతి కారును తనిఖీ చేసే వారు, ఆ రోజు స్కార్పియోను ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఫిబ్రవరి 14, 2019న, కాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఇందులో 4O మంది భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 2016 సెప్టెంబరు 18న, ఉరీ పట్టణానికి సమీపంలో ఉన్న సైనిక స్థావరంపై నలుగురు మిలిటెంట్లు భారత జవాన్లపై దాడి చేయగా 19మంది చనిపోయారు.