Abhijeet Dipke: మమ్మల్ని అడ్డుకోవాలనుకుంటున్నారు.. అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా శనివారం ఉదయం కొద్దిసేపు అందుబాటులో లేకుండా పోయింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున తమ పార్టీ గొంతును అణచివేసే ప్రయత్నం జరిగిందని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఉదయం 6.16 గంటలకు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తొలగించినట్లు ఎక్స్ వేదికగా దీప్కే పోస్టు చేశారు. అనంతరం 6.45 గంటలకు ఖాతాను తిరిగి పునరుద్ధరించినట్లు మరో పోస్టులో వెల్లడించారు. ఇలాంటి చర్యలకు తాము భయపడమని స్పష్టం చేశారు. తమ కార్యకలాపాలను అడ్డుకోవాలనుకునేవారు ఇందుకోసం స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎంచుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించడానికి ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
వివరాలు
'స్కూల్ ఠీక్ కరో' ప్రచారం ప్రారంభం
దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పెద్దగా మారడం లేదని అభిజీత్ దీప్కే అన్నారు.
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో తన సొంత గ్రామమైన సంతుక్ పింప్రీ నుంచి 'స్కూల్ ఠీక్ కరో' (School Thik Karo) ప్రచారాన్ని ప్రారంభించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల పరిస్థితిపై తల్లిదండ్రులు, గ్రామస్థులు, సర్పంచ్‌లు సామాజిక తనిఖీలు నిర్వహించి సంబంధిత వారిని ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు.
భారీ ప్రచార బ్యానర్ల కోసం ఖర్చు చేస్తున్న నిధులను గ్రామీణ పాఠశాలలు, విద్యార్థుల కోసం వినియోగిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని వ్యాఖ్యానించారు.
వివరాలు
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు
ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు దీప్కే తెలిపారు. ఈ బృందాలు గ్రామాల్లో పర్యటించి ప్రజల్లో అవగాహన కల్పిస్తాయని చెప్పారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు పూర్తవుతున్నా.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండకూడదని ఆయన పేర్కొన్నారు.