Venkaiah Naidu: నా కుమారుడు, కుమార్తె రాజకీయాల్లోకి రాకపోవడానికి కారణమిదే : వెంకయ్య నాయుడు
ఈ వార్తాకథనం ఏంటి
మన భవిష్యత్ సురక్షితంగా, సమృద్ధిగా ఉండాలంటే ప్రకృతితో సమన్వయంగా జీవించాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) అన్నారు. మన పండుగలన్నీ ప్రకృతితో ముడిపడి ఉన్నవేనని ఆయన పేర్కొన్నారు. ముచ్చింతల్‌లో స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సందర్భంగా వెంకయ్యనాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటలు కోసి ఇంటికి చేరే వేళనే సంక్రాంతి పండుగను జరుపుకుంటామని తెలిపారు. అయితే ఇటీవలి కాలంలో వాతావరణ మార్పుల కారణంగా రుతువులే మారుతున్న పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్పులు ఎన్ని వచ్చినా మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
Details
సేవా కార్యక్రమాలను కొనసాగించాలి
మూలాలను మర్చిపోకూడదన్న ఉద్దేశంతోనే ప్రతి ఏడాది స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఈ తరహా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించడం తనకు ఇష్టం లేదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అందుకే తన కుమారుడు, కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకురాలేదన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడమే పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగలిగే అసలైన సంపద అని పేర్కొన్నారు. తన పిల్లలకు వారసత్వంగా స్వర్ణ భారత్ ట్రస్ట్‌ను మాత్రమే ఇస్తున్నానని, ఈ సేవా కార్యక్రమాలను కొనసాగించాలని తన కుమార్తెకు సూచించినట్లు వెల్లడించారు.
Details
అమరావతి కూడా అభివృద్ధి చెందాలి
హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెందిన నగరమని కొనియాడిన వెంకయ్యనాయుడు.. ఆంధ్రప్రదేశ్‌కు కూడా అలాంటి రాజధాని అవసరమన్నారు. హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఏపీ రాజధాని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, సినీ నటుడు బ్రహ్మానందం తదితర ప్రముఖులు పాల్గొన్నారు.