LOADING...
Delhi airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీ గాలుల బీభత్సం.. దెబ్బతిన్న మూడు ఎయిర్ ఇండియా విమానాలు
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీ గాలుల బీభత్సం.. దెబ్బతిన్న మూడు ఎయిర్ ఇండియా విమానాలు

Delhi airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీ గాలుల బీభత్సం.. దెబ్బతిన్న మూడు ఎయిర్ ఇండియా విమానాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2026
03:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) టెర్మినల్-2 వద్ద ఆదివారం (జూన్ 7) తీవ్ర గాలులు, వర్షం కారణంగా మూడు ఎయిర్ ఇండియా విమానాలు దెబ్బతిన్నాయి. వాతావరణం మారిపోవడంతో గ్రౌండ్ సపోర్ట్ పరికరాలు అదుపుతప్పి విమానాలను ఢీకొట్టినట్లు విమానాశ్రయ నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోల్లో బలమైన గాలుల కారణంగా గ్రౌండ్ సపోర్ట్ పరికరాలు రన్‌వేపై జారుకుంటూ వెళ్లడం, వాటిని నియంత్రించేందుకు సిబ్బంది ప్రయత్నించడం కనిపించింది. విమానాశ్రయ నిర్వాహకుల ప్రకారం, ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ విభాగం, ఇండిగోకు చెందిన కొన్ని గ్రౌండ్ పరికరాలు తీవ్ర గాలుల ప్రభావంతో తమ స్థానాల నుంచి కదిలి టెర్మినల్-2 వద్ద పార్క్ చేసి ఉన్న విమానాలను ఢీకొన్నాయి.

వివరాలు

ఇప్పటివరకూ స్పందించని ఎయిర్ ఇండియా

ఈ ఘటనలో దెబ్బతిన్న మూడు ఎయిర్ ఇండియా విమానాలను తాత్కాలికంగా సేవల నుంచి తప్పించినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా, వాతావరణంలో ఆకస్మిక మార్పులపై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) నుంచి విమానాశ్రయ నిర్వాహకులకు లేదా ఎయిర్‌లైన్స్‌కు ముందస్తు హెచ్చరిక అందలేదని కూడా వెల్లడించారు. ఘటనపై ఎయిర్ ఇండియా ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే వార్తా సంస్థ పీటీఐకి ఓ ఎయిర్‌లైన్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఎయిర్ ఇండియా విమానాలతో పాటు ఇతర ఎయిర్‌లైన్స్‌కు చెందిన కొన్ని విమానాలు కూడా ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావానికి గురయ్యాయి. దెబ్బతిన్న మూడు ఎయిర్ ఇండియా విమానాల్లో రెండు త్వరలోనే తిరిగి సేవల్లోకి వచ్చే అవకాశం ఉండగా, మరో విమానానికి మరికొంత సమయం పట్టవచ్చని ఆయన పేర్కొన్నారు.

వివరాలు

తీవ్ర వేడిగాలుల నుంచి ఉపశమనం

ఇదిలా ఉండగా, జూన్ 4న ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాలను భారీ తుపాను అతలాకుతలం చేసింది. బలమైన గాలులకు అనేక చెట్లు నేలకూలగా, జనజీవనం కొంతసేపు స్తంభించింది. అయితే అదే సమయంలో ఢిల్లీ ప్రజలను తీవ్ర వేడిగాలుల నుంచి ఉపశమనం కలిగించింది. తుపాను అనంతరం జూన్ 5న ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అదే రోజు రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఐఎండీ గణాంకాల ప్రకారం, రిడ్జ్ ప్రాంతంలో అత్యధికంగా 40.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

Advertisement

వివరాలు

ఇది సాధారణ స్థాయి కంటే 0.7 డిగ్రీలు తక్కువ

ఇది సాధారణ స్థాయి కంటే 0.7 డిగ్రీలు తక్కువ. పాలం ప్రాంతంలో 40.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా, ఇది సాధారణం కంటే 0.8 డిగ్రీలు తక్కువగా ఉంది. సఫ్దర్‌జంగ్, లోధీ రోడ్ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌గా నమోదై సాధారణ స్థాయిలోనే కొనసాగింది. ఇక అయానగర్‌లో 39.6 డిగ్రీల సెల్సియస్ నమోదై, సాధారణం కంటే 2.5 డిగ్రీలు తక్కువగా ఉంది.

Advertisement