Plane: మూడు వ్యూహాలతో విమానాల ఉద్గారాలకు బ్రేక్..అధ్యయనంలో వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం నుంచి వెలువడుతున్న ఉద్గారాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. కేవలం మూడు కీలక వ్యూహాలను అమలు చేస్తే, విమానాల ద్వారా వచ్చే కార్బన్ ఉద్గారాలను 50 శాతానికి మించిన స్థాయిలో తగ్గించవచ్చని పరిశోధకులు స్పష్టం చేశారు. అత్యధిక ఇంధన సామర్థ్యం కలిగిన విమానాలనే వినియోగంలోకి తీసుకోవడం,విమానాల్లో పూర్తిగా ఎకానమీ క్లాస్ సేవలకే పరిమితం కావడం, అలాగే ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచడం వంటి చర్యలతో ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని అధ్యయనం పేర్కొంది.
వివరాలు
ఫస్ట్ క్లాస్ విభాగాల ద్వారా ఎక్కువ కార్బన్ ఉద్గారాలు
''లార్జ్ కార్బన్ డై ఆక్సైడ్ ఎమిషన్స్ అవాయిడెన్స్ పొటెన్షియల్ ఇన్ ఇంప్రూవ్డ్ కమర్షియల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ ఎఫీషియన్సీ'' అనే శీర్షికతో ఈ పరిశోధనను 'కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్' జర్నల్‌లో ప్రచురించారు. అధ్యయన వివరాల ప్రకారం, దీర్ఘదూర ప్రయాణాలకు బోయింగ్ 787-9 విమానాలను, తక్కువ నుంచి మధ్యస్థ దూరాల కోసం ఏ321 నియో విమానాలను ఉపయోగిస్తే 25 నుంచి 28 శాతం వరకు ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తేలింది. అలాగే,ఎకానమీ క్లాస్‌తో పోలిస్తే బిజినెస్, ఫస్ట్ క్లాస్ విభాగాల ద్వారా ఎక్కువ కార్బన్ ఉద్గారాలు వెలువడుతున్నాయని పరిశోధకులు గుర్తించారు.
వివరాలు
2.7 కోట్లకు పైగా కమర్షియల్ విమాన ప్రయాణాల డేటాను విశ్లేషించిన తర్వాత ఈ అధ్యయనం
విమానాల్లో సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా 22 నుంచి 57 శాతం వరకు ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉందని అధ్యయనం వెల్లడించింది. మరోవైపు, విమానయాన సంస్థలు తమ వద్ద ఉన్న అత్యంత సమర్థవంతమైన విమానాలను ఇప్పటికే నిర్వహిస్తున్న మార్గాల్లోనే వ్యూహాత్మకంగా వినియోగిస్తే, అదనంగా 11 శాతం వరకు ఉద్గారాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. 2023 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 2.7 కోట్లకు పైగా కమర్షియల్ విమాన ప్రయాణాల డేటాను విశ్లేషించిన తర్వాత ఈ అధ్యయనాన్ని సిద్ధం చేసినట్లు పరిశోధకులు తెలిపారు.