LOADING...
NEET: నీట్ 2026కు కట్టుదిట్టమైన భద్రత.. విమానాల్లో ప్రశ్నాపత్రాల తరలింపు!
నీట్ 2026కు కట్టుదిట్టమైన భద్రత.. విమానాల్లో ప్రశ్నాపత్రాల తరలింపు!

NEET: నీట్ 2026కు కట్టుదిట్టమైన భద్రత.. విమానాల్లో ప్రశ్నాపత్రాల తరలింపు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 21, 2026
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న నీట్ (యూజీ) 2026 పునఃపరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అభ్యర్థులకు పలు కీలక సూచనలు జారీ చేసింది. పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని స్పష్టం చేసింది. అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు, చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను వెంట తీసుకురావాలని సూచించింది. నిషేధిత వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురావడానికి అనుమతి ఉండదని తెలిపింది. ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది.

వివరాలు

సైనిక విమానాల్లో ప్రశ్నాపత్రాల తరలింపు

పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రశ్నాపత్రాలను సైనిక విమానాల ద్వారా పరీక్షా కేంద్రాలకు తరలించారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పెన్-అండ్-పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. వికలాంగ అభ్యర్థులకు అదనపు సమయం కల్పిస్తూ సాయంత్రం 6:20 గంటల వరకు పరీక్ష రాసేందుకు అవకాశం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 551 నగరాల్లోని పరీక్షా కేంద్రాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో కూడా పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 22.79 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.

వివరాలు

భారీ భద్రతా ఏర్పాట్లు

నీట్ రీ-ఎగ్జామ్ నిర్వహణ కోసం 2 లక్షలకు పైగా సిబ్బందిని, 674 మంది సిటీ కోఆర్డినేటర్లను రంగంలోకి దించారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, ఇతర అవకతవకలకు తావులేకుండా సీసీటీవీ నిఘా, జీపీఎస్ ట్రాకింగ్ వాహనాలు, ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణను తప్పనిసరి చేశారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా బయోమెట్రిక్ ధ్రువీకరణ జరగకపోయినా అభ్యర్థులను పరీక్షకు అనుమతిస్తారు. అలాంటి సందర్భాల్లో లిఖితపూర్వక హామీ పత్రం, మాన్యువల్ వెరిఫికేషన్ ఆధారంగా పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం కల్పిస్తారు.

Advertisement

వివరాలు

విద్యార్థుల సౌకర్యాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ బ్యాకప్, ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం, వైద్య సహాయ బృందాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించగలరు. 1:30 గంటల తర్వాత గేట్లు మూసివేస్తారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతి ఉండదని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. పారదర్శకమైన వాటర్ బాటిళ్లను మాత్రమే పరీక్షా కేంద్రంలోకి తీసుకురావడానికి అనుమతి ఉంది. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాలు, ఆభరణాలపై పూర్తి నిషేధం విధించారు.

Advertisement

వివరాలు

వదంతులను నమ్మొద్దు

ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించిన వదంతులు, సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అసత్య సమాచారాన్ని నమ్మవద్దని ఎన్‌టీఏ అభ్యర్థులకు సూచించింది. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యల కోసం సైబర్ క్రైమ్ విభాగం, సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.

Advertisement