Southwest monsoon : నైరుతి రుతుపవనాల ఎంట్రీకి టైమ్ ఫిక్స్.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ గుడ్‌న్యూస్
ఈ వార్తాకథనం ఏంటి
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు శుభవార్త తెలిపింది. ప్రస్తుతం తీవ్రమైన వేసవి ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు త్వరలో ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ సమయానికి ముందుగానే దేశంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. దేశ వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే రానున్నాయని ఐఎండీ పేర్కొనడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ 1న రుతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. అయితే ఈసారి మే 26 నాటికే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
వివరాలు
మే 31న తెలంగాణకు
అలాగే నైరుతి రుతుపవనాలు ఇవాళ లేదా రేపటిలోగా దక్షిణ బంగాళాఖాతం, అండమాన్-నికోబార్ దీవుల ప్రాంతాలకు చేరుకునేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపింది. గతేడాది పరిస్థితులను పరిశీలిస్తే, మే 24న కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు మే 31 నాటికి తెలంగాణను తాకాయి. ఈసారి కూడా జూన్ 1 నుంచి జూన్ 4 మధ్య తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ నుంచి జూలై ప్రారంభం వరకు రుతుపవనాల తొలి దశలో స్థిరమైన వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
వివరాలు
రాయలసీమ ప్రాంతాల్లో మే 19న వర్షాలు
అయితే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎల్‌నినో ప్రభావం బలపడే అవకాశముండటంతో దేశవ్యాప్తంగా వర్షపాతంపై దాని ప్రభావం ఉండొచ్చని ఐఎండీ హెచ్చరించింది. ఇదిలా ఉండగా, రుతుపవనాల ప్రభావంతో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కర్ణాటక రాష్ట్రాల్లో ఈ వారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో మే 19 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని హెచ్చరించింది.
వివరాలు
నెల రోజుల వ్యవధిలో మిగతా ప్రాంతాలకు
దక్షిణ భారతదేశాన్ని తాకిన తర్వాత ఈ రుతుపవనాలు నెలరోజుల వ్యవధిలో దేశంలోని మిగతా ప్రాంతాలకు విస్తరించే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం రుతుపవనాల కదలిక వేగంగా సాగుతోందని తెలిపింది. అయితే తెలంగాణలో మాత్రం ఈ నెల 18వ తేదీ వరకు వేడిగాలుల ప్రభావం కొనసాగుతుందని ఐఎండీ వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా కురిసే అవకాశముందని తెలిపింది.