LOADING...
Sushmita Dev: మమతకు మరో షాక్‌.. రాజ్యసభకు సుష్మితా దేవ్ రాజీనామా, హిమంతతో భేటీ!
మమతకు మరో షాక్‌.. రాజ్యసభకు సుష్మితా దేవ్ రాజీనామా, హిమంతతో భేటీ!

Sushmita Dev: మమతకు మరో షాక్‌.. రాజ్యసభకు సుష్మితా దేవ్ రాజీనామా, హిమంతతో భేటీ!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2026
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు మరో రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు సుష్మితా దేవ్ తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇటీవలే టీఎంసీకి చెందిన సీనియర్ నేత,మమతకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సుఖేందు శేఖర్ రాయ్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా,ఇప్పుడు సుష్మితా దేవ్ కూడా అదే బాట పట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అస్సాం కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ కేంద్ర మంత్రి సంతోష్ మోహన్ దేవ్ కుమార్తె అయిన సుష్మితా దేవ్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. గతంలో అస్సాంలోని సిల్చార్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.

వివరాలు 

టీఎంసీలో చేరిన కొద్ది కాలంలోనే ఆమెకు కీలక బాధ్యతలు

అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైన అనంతరం కాంగ్రెస్‌కు దూరమై, 2021లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. టీఎంసీలో చేరిన కొద్ది కాలంలోనే ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించడంతో పాటు, రాజ్యసభ సభ్యురాలిగానూ ఎంపిక చేశారు. అయితే బుధవారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఛైర్మన్‌కు లేఖ రాసిన సుష్మితా దేవ్, దానిని వెంటనే ఆమోదించాలని కోరారు. ఇదిలా ఉండగా,ఆమె రాజీనామా ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మను సుష్మితా దేవ్ కలిశారు. ఇద్దరూ ఆత్మీయంగా మాట్లాడుకుంటూ, నవ్వుతూ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివరాలు 

సుష్మితా దేవ్ రాజకీయ భవిష్యత్తుపై కొత్త చర్చ

ఈ భేటీతో సుష్మితా దేవ్ రాజకీయ భవిష్యత్తుపై కొత్త చర్చ మొదలైంది. ఆమె త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశంపై సుష్మితా దేవ్ లేదా బీజేపీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజీనామా తర్వాత హిమంతతో సుష్మితా సమావేశం 

Advertisement