Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. రెబల్ శిబిరం వైపు సాయోని ఘోష్?
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల వరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులుగా, విధేయులుగా ఉన్న నాయకులు కూడా క్రమంగా ఆమెకు దూరమవుతున్నారనే చర్చ సాగుతోంది. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ, పార్టీ కీలక నేత సాయోని ఘోష్ కూడా తిరుగుబాటు వర్గం వైపు అడుగులు వేస్తున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. జాదవ్‌పూర్ ఎంపీ సాయోని ఘోష్ గతంలో మమతా బెనర్జీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఒక సందర్భంలో మమతా బెనర్జీ దేశ ప్రధానమంత్రి కావడం ఖాయమని కూడా ఆమె వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం కాకొలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలోని టీఎంసీ రెబల్ వర్గంలో చేరేందుకు సాయోని సిద్ధమైనట్లు సమాచారం.
వివరాలు
ఆమె వైఖరిలో మార్పు..
తిరుగుబాటు ఎంపీలకు మద్దతు తెలుపుతూ ఆమె సంతకం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సాయోని కోల్‌కతాలో కాకుండా ఢిల్లీలో ఉన్నారని, అక్కడే రెబల్ వర్గానికి చెందిన ఎంపీలు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే సాయోని ఘోష్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ మమతా బెనర్జీకి నమ్మిన అనుచరురాలిగా గుర్తింపు పొందారు. మమత జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని, ప్రధాని అయ్యే సత్తా ఉందని పలుమార్లు ఆమె పేర్కొన్నారు. అయితే బెంగాల్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఆమె వైఖరిలో మార్పు కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది.
వివరాలు
ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత సాయోని ఘోష్ బీజేపీపై తీవ్ర విమర్శలు
గతంలో ఒక ఇంటర్వ్యూలో తాను ఎప్పటికీ మమతా బెనర్జీని విడిచిపెట్టబోనని చెప్పిన సాయోని ఘోష్, తాజా పరిణామాలతో టీఎంసీ అధిష్ఠానానికి పెద్ద షాక్ ఇచ్చినట్టయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం చవిచూసిన తర్వాత కూడా సాయోని ఘోష్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో బీజేపీ ఓట్ల దొంగతనానికి పాల్పడిందని ఆరోపిస్తూ, టీఎంసీ ఓడిపోలేదని, ఓట్ల దోపిడీ జరిగిందని వ్యాఖ్యానించారు. అలాగే 2029లో దేశ ప్రజలు, 2031లో బెంగాల్ ప్రజలు బీజేపీకి తగిన సమాధానం చెబుతారని ఆమె విమర్శించారు. అయితే ఆ వ్యాఖ్యలు చేసిన కొద్ది కాలానికే సాయోని ఘోష్ రెబల్ వర్గానికి మద్దతు ఇస్తున్నారనే వార్తలు రావడం బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.