Kadapa: కడప జిల్లాలో విషాదం.. అప్పుల బాధతో రైతు కుటుంబం ఆత్మహత్య.. నలుగురు మృతి
కడప జిల్లా సింహాద్రిపురం మండలం దిద్దేకుంటలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక నాగేంద్ర అనే రైతు తన కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనలో నాగేంద్ర, ఆయన భార్య వాణి, కుమార్తె గాయత్రీ (14), కుమారుడు భార్గవ్ (15) మృతి చెందారు. మొదట నాగేంద్ర తన పిల్లలిద్దరిని వ్యవసాయ పొలానికి ఉన్న గేటుకు ఉరివేసి చంపిన తర్వాత, భార్యాభర్తలు చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. నాగేంద్ర గతంలో 8 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి నష్టపోయారు. ఆపై డైరీ ఫార్మ్ ప్రారంభించగా, 5 ఏనుములు గల్లంతయ్యాయి.
అప్పులదారుల నుంచి వేధింపులు తీవ్రతరం
గోర్ల వ్యాపారం ప్రారంభించినా ఒకేసారి 48 గొర్రెలు మరణించాయి. చివరికి కొర్ర పంట సాగు చేయగా, వర్షాల కారణంగా పంట పూర్తిగా నాశనం అయింది. ఈ నేపథ్యంలో అతనికి దాదాపు 30 లక్షల అప్పులు ఉండటంతో అప్పులదారుల వేధింపులు తీవ్రతరమయ్యాయి. ఈ ఆర్థిక ఒత్తిడి తట్టుకోలేక, నాగేంద్ర తన కుటుంబంతో కలిసి ఈ విషాదకర నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.