TMC: 60 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు.. పార్టీ కమిటీలన్నీ రద్దు చేసిన మమతా బెనర్జీ
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది తిరుగుబాటు ధోరణి ప్రదర్శించడంతో పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాలన్నింటినీ వెంటనే రద్దు చేస్తున్నట్లు టీఎంసీ ప్రకటించింది. పార్టీ సంస్థాగత వ్యవస్థను పూర్తిగా పునర్వ్యవస్థీకరించే ముందు అన్ని స్థాయిల్లో ఆత్మపరిశీలన, పనితీరు సమీక్ష, సంస్థాగత అంచనా ప్రక్రియ చేపడతామని టీఎంసీ తెలిపింది. ఈ సమీక్ష అనంతరం కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.
వివరాలు
రితబ్రతకు 59 మంది ఎమ్మెల్యేల మద్దతు.. అసెంబ్లీలో టీఎంసీ తిరుగుబాటు
బుధవారం అసెంబ్లీలో ఈ సంక్షోభం బహిర్గతమైంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి 59 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచి అసెంబ్లీకి రావడం కలకలం రేపింది. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీని ఎంపిక చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే మమతా బెనర్జీ ఇప్పటికే సోవందేబ్ చట్టోపాధ్యాయ్‌ను ప్రతిపక్ష నేతగా మద్దతు ఇవ్వడం తెలిసిందే. ఇటీవల సోవందేబ్ చట్టోపాధ్యాయ్‌కు మద్దతుగా పంపిన పార్టీ లేఖలో తమ సంతకాలను నకిలీగా ఉపయోగించారని రితబ్రత బెనర్జీ, సందీపన్ సహా ఆరోపించారు. దీనిపై అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత వారిని పార్టీ నుంచి బహిష్కరించారు.
వివరాలు
మమతా నాయకత్వానికి ఎమ్మెల్యేల సవాల్
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత టీఎంసీలో అసంతృప్తి పెరుగుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశాలకు కూడా పలువురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఎన్నికల అనంతర హింసకు వ్యతిరేకంగా కోల్‌కతాలో మమతా చేపట్టిన నిరసన కార్యక్రమంలో కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆమెతో కనిపించడం చర్చనీయాంశమైంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు మాత్రం మమతా బెనర్జీయే తమ నాయకురాలని స్పష్టం చేస్తూనే, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీని కోరుతున్నామని పేర్కొన్నారు. అయితే ఈ తిరుగుబాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నాయకత్వంపై అసంతృప్తికి నిదర్శనమని, ఇది మమతా బెనర్జీ అధికారానికి కూడా సవాలుగా మారిందని పార్టీ సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
వివరాలు
తిరుగుబాటు వేళ మమతాకు అండగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు
ఇదిలా ఉండగా, ఈ పరిణామాలను టీఎంసీ అంతర్గత వ్యవహారంగా మాత్రమే చూస్తున్నామని బీజేపీ పేర్కొంది. మమతా బెనర్జీకి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలలో నైనా బంద్యోపాధ్యాయ్, ఫిర్హాద్ హకీమ్, కునాల్ ఘోష్, బిమాన్ బంద్యోపాధ్యాయ్, సోవందేబ్ చట్టోపాధ్యాయ్, మదన్ మిత్రా, అశోక్ దేవ్, అసిమా పాత్ర ఉన్నారు. వీరిలో చాలామంది 1998లో టీఎంసీ ఆవిర్భావం నుంచి మమతా బెనర్జీతోనే కొనసాగుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తృణమూల్ కాంగ్రెస్ చేసిన ట్వీట్
After careful consideration, it has been decided that all committees of the All India Trinamool Congress in West Bengal, as well as all its frontal organisations, shall stand dissolved with immediate effect.
— All India Trinamool Congress (@AITCofficial) June 3, 2026
The party will undertake a comprehensive exercise of introspection,…