Trishul: డ్రగ్స్, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాల కట్టడికి 'త్రిశూల్'
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ లో మాదక ద్రవ్యాల నియంత్రణ, నేరాల నివారణ, రోడ్డు ప్రమాదాలను అరికట్టే లక్ష్యంతో 'త్రిశూల్' పేరుతో కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీ ఆధ్వర్యంలో, జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ నేతృత్వంలో ఈ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఆయా కమిటీల్లో వివిధ శాఖలకు చెందిన అధికారులు సభ్యులుగా ఉంటారు. కమిటీకి పేరు నిర్ణయించే సమయంలో అధికారుల అభిప్రాయాలను తీసుకోగా.. ఎక్కువ మంది ఆమోదించిన 'త్రిశూల్' పేరును ఖరారు చేశారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా శుక్రవారం సాయంత్రం శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్రంలో నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళలపై దాడులకు సంబంధించిన అంశాలపై అధికారులు ప్రజంటేషన్లు ఇచ్చారు.
వివరాలు
అభ్యంతరకర పోస్టులపై వెంటనే చర్యలు
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. నేరం చేస్తే తప్పించుకోలేమనే భయం నేరస్థుల్లో కలిగేలా పోలీసులు, అధికారులు పనిచేయాలని సూచించారు.
విశాఖపట్నం, తిరుపతి, అమరావతిలో డీఎడిక్షన్ ఎక్స్‌లెన్స్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
క్రిటికల్ కేసుల్లో డీఎన్‌ఏ పరీక్షల ఫలితాలు రావడానికి పడుతున్న సమయాన్ని మరింత తగ్గించాలని చంద్రబాబు సూచించారు.
సోషల్ మీడియా ఆగడాలపై మంత్రుల కమిటీ లోతుగా అధ్యయనం చేయాలని తెలిపారు. వ్యవస్థీకృతంగా సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న వేధింపులపై మరింత దృష్టి పెట్టాలని, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
గంజాయి సహా డ్రగ్స్ వంటి నేరాల నియంత్రణకు క్యాలెండర్ రూపొందించుకుని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని చంద్రబాబు సూచించారు.
వివరాలు
30 నిమిషాల్లోనే చేరుకోవాలి
నేరం జరిగిన ప్రాంతానికి పోలీసులు 30 నిమిషాల్లోనే చేరుకోవాలని ఆదేశించారు. సంఘటనా స్థలానికి ఎంత త్వరగా చేరుకుంటే అంత మంచి ఫలితం ఉంటుందని పేర్కొన్నారు.
కోర్టు కేసుల పరిష్కారంలో భాగంగా 'వన్ కోర్టు- వన్ కానిస్టేబుల్' విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు సూచించారు.
ప్రాంతీయంగా ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని, డాగ్ స్క్వాడ్‌లను కూడా నియమించాలని ఆదేశించారు.
ప్రస్తుతం నేరాల్లో శిక్షల రేటు 47 శాతంగా ఉందని, దీనిని 80 శాతానికి పైగా పెంచాలని నిర్దేశించారు. ప్రతి రోడ్డు ప్రమాదాన్ని ఆడిట్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
ఇందుకోసం ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని సూచించారు. సీఐడీలో 24/7 అందుబాటులో ఉండేలా ప్రత్యేక టెక్నికల్ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వివరాలు
గైర్హాజరైతే సస్పెండ్ చేస్తా
కలెక్టర్ల సదస్సుకు విభాగాధిపతులు హాజరు కాకుంటే సస్పెండ్ చేస్తానని చంద్రబాబు హెచ్చరించారు.
శాంతిభద్రతలపై చర్చ జరుగుతున్న సమయంలో డ్రగ్స్ డైరెక్టర్ అందుబాటులో లేకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
శుక్రవారం ఉదయం దస్త్రాల పరిష్కారంపై జరిగిన చర్చ సందర్భంగా కూడా కొందరు అధికారులు అందుబాటులో లేరు.
ఈ విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు.. అధికారుల హాజరును తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
వివరాలు
ప్రతి 100 ప్రమాదాలకు 42.7 మంది మృతి
జాతీయ సగటు కంటే ఏపీలోనే ఎక్కువ
రోడ్డు ప్రమాదాల్లో జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2024లో దేశవ్యాప్తంగా ప్రతి 100 రోడ్డు ప్రమాదాలకు సగటున 36.3 మంది చనిపోగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య 42.7గా ఉంది.
అంటే జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల మరణాల రేటు ఎక్కువగా ఉంది.
రోడ్డు ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో ఏటా 18 వేలకుపైగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో ఎక్కువ మంది 35-45 ఏళ్ల మధ్య వయసున్నవారే ఉన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమీక్షలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన అంశాలపై పోలీసు శాఖ ప్రజంటేషన్ ఇచ్చింది.